బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనగాని నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. రేపల్లెలోని పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తామని శనివారం నాడు టీడీపీ ప్రకటించింది. మద్యం మరణాలపై టీడీపీ వేసిన నిజనిర్ధారణ కమిటీ బాధిత కటుంబాలను కలిసేందుకు సిద్ధమైంది. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పోటుమెరక వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులుటీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
కాగా బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మద్యం సేవించిన అనంతరం ఇద్దరు మృతి చెందిన ఘటనపై వదంతులు నమ్మవద్దని, వాళిద్దరూ అనారోగ్య కారణాలతో చనిపోయారని ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. కేసు విచారణ సమయంలో అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. శుక్రవారం నాడు పోటుమెరకలో గరికపాటి నాంచారయ్య (75), రేపల్లె రత్తయ్య (57) అనారోగ్య కారణాలతో మృతి చెందారని ఎస్పీ తెలిపారు. మృతుల కుటుంబాలను విచారించగా మరణించిన వారిలో ఒక వ్యక్తి వయస్సు రీత్యా తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, మరొకరికి గుండె సమస్య ఉందని చెప్పారన్నారు. ఏదేమైనప్పటికీ పారదర్శకంగా దర్యాప్తు చేసి వాస్తవాన్ని ప్రజలకి తెలియజేస్తామన్నారు. వారు తిన్న ఆహారం, తాగిన మద్యాన్ని సీజ్ చేసి ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.