Site icon NTV Telugu

క్యాసినో రగడ… ‘జై గుడివాడ’ అంటూ వర్మ సెటైర్లు

సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని రెండు రోజులుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గుడివాడలో క్యాసినో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గుడివాడ ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని… క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా పూర్వీకులు అని.. వారికేం తెలియదని వర్మ సెటైర్లు వేశాడు.

Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

గుడివాడలో క్యాసినో నిర్వహించడాన్ని చిన్నచూపు చూస్తున్నవారంతా గోవా, లాస్ వెగాస్ లాంటి మెగా నగరాలను తక్కువ చేయడమేనని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. గుడివాడను ప్యారిస్, లండన్, లాస్ వెగాస్ వంటి నగరాల తరహాలో మంత్రి కొడాలి నాని అభివృద్ధి చేస్తున్నారని పంచ్‌లు వేశారు. ఇప్పటివరకు గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లారని… కానీ గోవా ప్రజలు గుడివాడకు రాలేదని.. క్యాసినో కారణంగా గోవా ప్రజలు గుడివాడ వచ్చేలా ఆధునీకరిస్తున్న మంత్రి కొడాలి నానిని అందరూ మెచ్చుకోవాలని వర్మ పేర్కొన్నాడు. అంతేకాకుండా తన ట్వీట్‌లో ‘జై గుడివాడ’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Exit mobile version