తూర్పుగోదావరి జిల్లా పోలవరం నిర్వాసిత గ్రామవాసులు కంటిమీద కునుకు లేకుండా జీవితాలు గడుపుతున్నారు. సీతారం ఆర్ &ఆర్ న్యూ కాలనీ జనావాసాల్లోకి భారీ కొండ చిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు గ్రామస్తులు. ఆత్మ రక్షణ కోసం వాటిని హతమారుస్తున్నారు. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అర కొర సదుపాయాలతో నిర్మించిన కాలనీలు జనం పాలిట శాపంగా మారుతున్నాయి.
అక్కడ కనీస సదుపాయాలు లేవు. వీధి దీపాలు లేవు,సిమెంట్ రోడ్లు లేవు,డ్రైనేజి వ్యవస్థ అసలే కనిపించడం లేదు,ఊరంతా నీటి ఊటలతో జలమయమై ఉంది. రాత్రి వేళల్లో నక్కలు ఇళ్లలో ఉన్న కోళ్లను పట్టుకుపోతున్నాయి. విష సర్పాలఉ ఇంటి ఆవరణలోకి, బాత్రూముల్లో, వంట గదిలో తిష్ట వేస్తున్నాయి. కనీసం వీధి దీపాలు ఉన్నా తమకు కొంత రక్షణ ఉంటుందని నిర్వాసిత గ్రామాల ప్రజలు అంటున్నారు.
తమకు అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకునే పాలకులు తమను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. వీధి దీపాలు కావాలని రెవిన్యూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడైనా నిర్వాసితుల కష్టాలను చూసి విష సర్పాల వలన నష్టం జరగక ముందే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, తమకు కనీస సదుపాయాలు కల్పించాలని ,గ్రామస్తులు కోరుతున్నారు.