ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు యావత్ భారత దేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పీయూష్ గోయెల్ అన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతీ బిడ్డా అదృష్టవంతుడే అని, వారి భవిష్యత్ అంతా ఉజ్వలమైందే అని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖ నిలుస్తోందని.. స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం అవుతుందన్నారు. 2047 నాటికి సుసంపన్నమైన దేశంగా భారత్ అవతరిస్తుందని, టెక్నాలజీ ద్వారా ఈ సుసంపన్నతను సాధిస్తాం అని పీయూష్ గోయెల్ చెప్పుకొచ్చారు.
విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. ‘టెక్నాలజీ డెమొక్రటైజేషన్ అనే విధానాన్ని పాటిస్తూ అందరికీ దానిని చేరువ చేస్తున్నాం. భారత్ తెచ్చిన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు చాలా దేశాలు అనుసరిస్తున్నాయి. 30 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులతో సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం. 104 శాటిలైట్లను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన దేశంగా సాంకేతికతను ప్రజలకు దగ్గర చేస్తున్నాం. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నాం. ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఉన్న భారత యువత ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. వసుదైక కుటుంబం అనే భారతీయ భావనను కోవిడ్ సమయంలో 110 దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి నిరూపించాం. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుని దానికి అనుగుణంగా వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నాం’ అని పీయూష్ గోయెల్ అన్నారు.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్ ఇలా!
‘డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ దిశగా, జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరికీ ఆర్ధిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన పరిస్థితులు ఉన్నా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్దఎత్తున భారత్ ఆకర్షిస్తూనే ఉంది. అత్యంత పారదర్శకమైన విధానంలో వాణిజ్యం ఉండాలని మేం కోరుకుంటున్నాం. సీఐఐ సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆలోచనలు, ఆవిష్కరణలు రావటం అభినందనీయం. వాణిజ్య ప్రదర్శనలకు, ఎగ్జిబిషన్లు, సదస్సులకు వీలుగా ఢిల్లీలో భారత్ మండపం ఉన్నట్టే ఆంధ్రా మండపం నిర్మించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రధాని మోడీపై ప్రజలు విశ్వాసం ఉంచారు అనడానికి వస్తున్న ఫలితాలే నిదర్శనం. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చెప్పుకోచ్చారు.
