ఒకవైపు కరోనా సంక్షోభం నుంచి ఇంకా బయటపడని సామాన్యులపై ప్రభుత్వాలు ధరల భారం మోపుతూనే వున్నాయి. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఉక్రెయిన్ సంక్షోభం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే వుంది. ఎండలు పెరుగుతున్నట్టే పెట్రో మంల కూడా కొనపాగుతోంది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం గత 13 రోజుల్లో ఇది 11వ సారి. తాజాగా లీటరు పెట్రోలుపై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117 రూపాయలు దాటేసి రూ. 117.21కి చేరుకుంది. డీజిల్ ధర రూ. 103.03కి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మంట కొనసాగుతూనే వుంది. గుంటూరులో లీటరు పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. ఫలితంగా పెట్రోలు ధర రూ. 119.07, డీజిల్ ధర రూ. 104.78కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరపై 80 పైసలు చొప్పున పెంచారు. కాగా, ఈ 11 రోజుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు 8 రూపాయలకు పైనే పెరిగింది. ధరల పెరుగుదలతో వాహనాలు బయటకు తీయాలంటేనే సామాన్యులు వెనకడుగు వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు వంట గ్యాస్ మంట కొనసాగుతూనే వుంది. దీంతో ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదని జనం తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
