Site icon NTV Telugu

Payyavula Keshav: ఏకాభిప్రాయం తర్వాతే.. రిమోట్ ఓటింగ్ మెషిన్ విధానాన్ని అమలు చేయాలి

Payyavula Keshav

Payyavula Keshav

Payyavula Keshav: వలస ఓటర్లు దేశంలో ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా రిమోట్ ఓటింగ్ మెషీన్ (ఆర్వీఎమ్) విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఢిల్లీలో ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. దీనిపై మరోసారి చర్చ జరగాలని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. రిమోట్ ఓటింగ్ మెషీన్ ఆలోచనను తాము సూత్రప్రాయంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం అనుసరించిన విధానాన్ని తప్పుబడుతున్నామని పేర్కొన్నారు. ముందుగా రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ఆర్వీఎం ప్రతిపాదనను తీసుకొచ్చారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

Read Also: Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. ఈ వారంలో రెండోది

రాజకీయ పార్టీలతో విస్తృత సంప్రదింపులు, ఏకాభిప్రాయం తర్వాతే ఆర్వీఎమ్ విధానాన్ని అమలు చేయాలని పయ్యావుల కేశవ్ సూచించారు. నేరుగా డెమో ఏర్పాటు చేసి ఈ విధానం తీసుకురావాలని అన్ని పార్టీలను ఈసీ ఆహ్వానించిందని.. డెమో కంటే ముందు పార్టీలన్నీ తమ అభిప్రాయం వినాలని పట్టుబట్టాయని తెలిపారు. లిఖితపూర్వకంగా పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పడం కోసం పెట్టిన జనవరి 31 డెడ్‍‌లైన్ కూడా పొడిగించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదన్నదే తమ విధానమని ఈసీ చెబుతోందని.. ఆ విధానానికి తాము కూడా అనుకూలమే అయినప్పటికీ అనేక సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సగటున 30 శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారని, వారిలో వలసపోయినవారే అధికమని ఈసీ చెబుతోందన్నారు. దీనిపై శాస్త్రీయమైన అధ్యయనం ఏదైనా జరిగిందా అని టీడీపీ ప్రశ్నిస్తోందని పయ్యావుల కేశవ్ అన్నారు. తాము గమనించినంత వరకు వలస కూలీలు తమ గ్రామాల్లో ఓటు వేస్తున్నారని.. కానీ యువత, పట్టణ, నగర ధనిక వర్గాలే ఓటింగుకు దూరంగా ఉంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు.

Exit mobile version