NTV Telugu Site icon

Payyavula Keshav On TTD: శ్రీవారిని భక్తులకు దూరం చేసే కుట్ర

కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అయితే, టీటీడీ నిర్ణయాల వల్ల శ్రీవారు భక్తులకు దూరం అవుతారని మండిపడుతున్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. టీటీడీ నిర్ణయాలపై పయ్యావుల కేశవ్ ఫైర్ అవుతున్నారు. భక్తులకు శ్రీవారిని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. టీటీడీ తీసుకునే నిర్ణయాలు శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్దంగా జరుగుతున్నాయన్నారు.

తిరుమల ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది.సామాన్య భక్తులకు ఏడుకొండల వాడిని దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఆధ్యాత్మిక తిరుమలను వ్యాపార కేంద్రం గా చేస్తున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్ వేలం పాటలా సాగింది. తిరుమల బోర్డు మొత్తం వ్యాపారవేత్తలతో ఏర్పాటయ్యింది.అందుకే వ్యాపార ధోరణి కనిపిస్తుంది. కోవిడ్ పేరుతో ఇంకా ఆంక్షలు పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఆంక్షలు లేవు. కానీ టిక్కెట్ లేకుంటే తిరుపతి నుంచి తిరుమలకు కూడా వెళ్లనీయడం లేదు.

బీజేపీ ఈ నిబంధనలపై ఎందుకు మౌనంగా ఉంది. మీరు ఏ దేవుడిని అయినా పూజించుకోండి…కానీ మా దేవుడిని మాత్రం మాకు దూరం చెయ్యకండి అన్నారు పయ్యావుల కేశవ్. సమాన దర్శనం లేదు…సమాన వసతి లేదు…సమాన భోజనం ఎందుకు? టీటీడీ హోటల్ వ్యాపారంలోకి వెళ్లడం ఎందుకు? మీరు ఉన్నది అందుకు కాదు. టీటీడీ నిర్ణయాలు అన్నీ వెనక్కి తీసుకోవాలి…ఈవో బాధ్యత తీసుకోవాలని పయ్యావుల కోరారు.