Site icon NTV Telugu

Pawan Kalyan: అనుష్టుప్ నారసింహ యాత్రపై చర్చ.. కీలక సూచనలిచ్చిన జనసేనాని

Pawan Kalyan Hyderabad Meet

Pawan Kalyan Hyderabad Meet

Pawan Kalyan Meeting With Janasena Party Leaders In Hyderabad: శరన్నవరాత్రి పర్వదినాల్లో భాగంగా.. పంచమి తిధిని పురస్కరించుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సరస్వతి పూజ నిర్వహించారు. తెల్లవారుజామునే హైదరాబాద్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారిని అర్చించి, తెలుగు రాష్ట్రాలకు సకల శుభాలు కలగచేయాలని ప్రార్థించారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులు, కార్యాలయ నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. అక్టోబర్ మాసంలో పార్టీపరంగా నిర్వహించాలనుకున్న సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా.. మంగళగిరిలో నిర్వహించనున్న పార్టీ సమావేశాలకు సంబంధించి ఆయన కీలక సూచనలు ఇచ్చారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదే సమయంలో.. అనుష్టుప్ నారసింహ యాత్రపై పవన్ చర్చించినట్టు తెలిసింది. తొలుత కొండగట్టు ఆంజనేయ స్వామికి పూజలు జరిపి.. అక్కడి నుంచి ధర్మపురి క్షేత్రానికి వెళ్లి శ్రీ నరసింహ స్వామిని దర్శించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అనంతరం తెలంగాణలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అటు.. సోషల్ మీడియా – శతఘ్ని క్రియాశీలక సభ్యులతోనూ పవన్ సమావేశం కానున్నట్టు తెలిపారు. జిల్లాలవారీగా సమీక్షలు చేపట్టబోతున్నారని.. ఈ సమీక్ష సమావేశాలు కృష్ణా జిల్లా, విజయవాడ అర్బన్‌లతో మొదలవుతాయని తెలిసింది. ‘నా సేన నా వంతు’ కార్యక్రమంపై సమీక్ష చేపట్టడంతో పాటు రాష్ట్ర యాత్ర నిర్వహణకు సంబంధించి సన్నాహకాలపై ముఖ్య నేతలతో సమాలోచన జరపనున్నారు.

Exit mobile version