కర్నూలు జిల్లా రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. కానీ ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా ప్రజలకే నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని.. పొత్తులపై చర్చలు అవసరమని.. పార్టీలు చాలా విశాల దృష్టితో ఆలోచించాలని పవన్ తెలిపారు. ఏపీ నిర్మాణానికి అన్ని పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం బీజేపీతో తమ పొత్తు కొనసాగుతోందని.. మోదీ, అమిత్ షా అంటే తనకు చాలా గౌరవం ఉందని పవన్ పేర్కొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని.. అప్పుడు ఏపీకి భవిష్యత్ ఉండదని పవన్ అన్నారు. డైరెక్టుగా చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే తాము పరిశీలిస్తామన్నారు. సోము వీర్రాజు ఏం మాట్లాడారో తనకు తెలియదని.. ఆయన వ్యాఖ్యలు విన్నాక స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయడం లేదని పవన్ ఆరోపించారు. తాము ఏం చేసినా తిరుగు ఉండదనే విధంగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కౌలు రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకుని ఉంటే జనసేన రైతు భరోసా యాత్ర చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.