భీమవరంలో నిన్న ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాకపోవటంపై ఏపీలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ స్పందించారు. పవన్ కళ్యాణ్ మొన్న ఇచ్చిన వీడియో సందేశమే ఆయనపై వస్తున్న విమర్శలకు సమాధానమని చెప్పారు. జనసేన శ్రేణులు ప్రధానమంత్రి సభను జయప్రదం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు.
Read Also: Megastar Chiranjeeevi: పేరు మార్చుకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే..?
అసలు ఈ కార్యక్రమానికి, రాజకీయాలకి సంబంధంలేదని చెప్పారు. జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని మరోసారి చెప్పారు. ఏపీలో ప్రధాని పర్యటన బాగా జరిగిందని సోము వీర్రాజు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీలకు కుటుంబ పాలనపైనే మక్కువని, బీజేపీకి మాత్రం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తమ పార్టీ ఎదుగుతుందని ఆశాభావం వెలిబుచ్చారు.
యువ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యువ సంఘర్షణ యాత్ర నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు. అది ఆయన మాటల్లోనే.. “యువతకు ఉద్యోగాలిస్తామని జగన్ హామీ ఇచ్చారు. టీచర్లు, పోలీసు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తాంనన్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని కూడా చెప్పారు. అన్ని వర్గాల వారికీ నేనున్నానని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ మాటలను మర్చిపోయారు.
సీఎం జగన్ తీరు వల్ల అందరూ నష్టపోయారు. ఏపీలో రెండో విడత రేషన్ బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. దీనిపై బీజేపీ ఉద్యమిస్తుంది. పేదల పక్షాన పోరాడుతుంది. ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు ఎగరేయడం సరికాదు. మోడీ ఆదివాసీల గురించి మాత్రమే మాట్లాడారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం సరికాదు. కొందరు సడన్‌గా పుట్టుకొచ్చి మేధావుల్లా మాట్లాడుతున్నారు. వాళ్లను పట్టించుకోం. ఎందుకంటే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది మోడీ మంత్రం.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించాం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తాం. మా ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. ఏపీలోని జాతీయ రహదారులు బాగున్నా రాష్ట్ర రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను బాగుచేసే బాధ్యతని యువకులకు ఇస్తాం. మొక్కలు పెంచి, సంరక్షించే పనినీ నిరుద్యోగులకే అప్పజెబుతాం” అని సోము వీర్రాజు అన్నారు. అనంతరం ఆయన యువ సంఘర్షణ యాత్ర పోస్టర్‌ను, లోగోను ఆవిష్కరించారు.