NTV Telugu Site icon

Palla Srinivasa: వైసీపీకి వార్నింగ్.. దౌర్జన్యం చేస్తే, రౌడీల్లా వ్యవహరిస్తాం

Palla Srinivas

Palla Srinivas

Palla Srinivasa Warning To YCP: టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాస్ అధికార పార్టీ వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీ దౌర్జన్యం చేస్తే.. తాము కూడా రౌడీల్లా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్రపై ఆర్ధిక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. దసపల్లా భూములు, హయగ్రీవ భూముల దొపిడీని అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు. విజయసాయి, విశాఖ ఎంపీకి మధ్య వాటాల్లో తేడా వచ్చిందని.. అధికార పార్టీ నేతలే తమ అవినీతిని బయట పెట్టుకుంటున్న పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్ కుట్రలో భాగంగానే.. ఏపీలో జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఋషికొండ మీదున్న ప్రభుత్వ రిసార్ట్సును కూల్చేశారని మండిపడ్డ పల్లా శ్రీనివాస్.. ఆ కొండకి సమీపంలో విజయసాయి, జగన్ రాడిసన్ బ్లూ, బే పార్క్ రిసార్ట్స్ కట్టుకున్నారని అన్నారు. తమ రిసార్ట్స్‌కు వ్యాపారం పెంచుకోవడం కోసమే ప్రభుత్వ రిసార్ట్స్‌ను కూల్చారని.. రాజధాని కోసం కాదన్నారు. సీఎం సతీమణికి అక్కడ వ్యూ నచ్చడం వల్ల, అక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని ఏదేదో చెప్తూ.. ఋషికొండను బోడి కొండ చేశారన్నారు. సీఎం ఇల్లు కట్టుకోవాలంటే.. 80 అడుగుల మీదున్న కొండే కావాలా..? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో పులివెందుల పంచాయతీ కుదరదని.. ఉత్తరాంధ్ర విప్లవ పోరుగడ్డ అని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. వికేంద్రీకరణకు మద్దతు ఇస్తూ, శనివారం జేఏసీ విశాఖ గర్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జేఏసీ నాయకులు సహా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందులో పాల్గొన్నారు. మూడు రాజధానుల నినాదం మారుమోగుతున్న ఈ ర్యాలీలో సాంస్కృతిక ప్రదర్శనల్ని సైతం నిర్వహించారు.