NTV Telugu Site icon

Dr. Sankurathri Chandra Sekhar : పద్మశ్రీతో నా బాధ్యత మరింత పెరిగింది…

Dr. Sankurathri Chandra Sek

Dr. Sankurathri Chandra Sek

Dr. Sankurathri Chandra Sekhar : తనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చే శారు డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పద్మశ్రీ రావడం నా బాధ్యతను మరింత పెంచిందన్నారు.. ఎప్పుడూ గుర్తింపు కోసం పనిచేయలేదు, సమాజానికి నేను ఏమి ఇవ్వగలనని అని మాత్రమే ఆలోచించానని వెల్లడించారు.. నా కుటుంబాన్ని కోల్పోయినప్పుడు పేదలకు నా వంతు సాయం చేయాలని ఆలోచించాని పాత రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. నా టీం సభ్యుల కృషి వలన ఇదంతా సాధ్యమైందన్నారు.. నాలుగు దశాబ్దాలుగా విద్య, వైద్యం, కళా రంగంలో నాకు అవకాశమున్న మేర పని చేస్తూనే ఉన్నారు.. అవార్డుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలస్యమైందని అనుకోవడం లేదు.. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు అని తెలిపారు.. ఇక, నా భార్య పిల్లలను కోల్పోయిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేనన్న ఆయన.. వాళ్ల గుర్తుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని తెలిపారు..

Read Also: PM Narendra Modi: భారతీయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

కాగా, డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌కు ‘పద్మశ్రీ’ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం… చంద్రశేఖర్‌ 1943 నవంబరు 20న జన్మించారు. రాజమహేంద్రవరం, విశాఖ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభాసం సాగింది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. బయాలజీ చదువుకున్న ఆయన సైంటిస్ట్‌గా అక్కడే స్థిరపడ్డారు. అయితే, కాకినాడకు చెందిన మంజరిని 1975 మేలో వివాహం చేసుకున్నారు. వీరికి శ్రీకిరణ్‌ (6), శారదా(3) అనే ఇద్దరు పిల్లలు. భార్యా పిల్లలను కెనడా నుంచి స్వదేశానికి పంపించేందుకు… 1985 జూన్‌ 23న ‘కనిష్క’ విమానం ఎక్కించి వీడ్కోలు పలికారు. కానీ… ఆ విమానాన్ని ఖలిస్థాన్‌ ఉగ్రవాదులు పేల్చేయడంతో.. ఆయన జీవితం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.. అక్కడే ఆయన ఆలోచనలకు అడుగులు పడ్డాయి.. తన శక్తి మేర సేవ చేయాలనుకున్నారు.. పేదలకు సేవ చేస్తూ ఆ తృప్తి, ఆనందంలోనే తన భార్యా పిల్లలను వెతుక్కోవాలని నిర్ణయించుకున్న ఆయన.. కాకినాడలో అడుగుపెట్టి కొత్త జీవితం మొదలుపెట్టారు. కెనడాలోని తన ఆస్తిపాస్తులన్నీ విక్రయించి… స్వదేశానికి తిరిగి వచ్చారు. కుమారుడు కిరణ్‌ పేరుతో కంటి ఆస్పత్రి స్థాపించారు. 1993 నుంచి ఇప్పటి దాకా 3.40లక్షల మంది పేదలకు 90శాతం ఉచితంగా కేటరాక్ట్‌ ఆపరేషన్‌లు చేయించారు. మరో 38లక్షలమందికి అవుట్‌ పేషెంట్‌ విభాగంలో వైద్యం అందించిన గనత ఆయనకే దక్కింది.