NTV Telugu Site icon

High Alert For AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..!

Cyclone

Cyclone

High Alert For AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇక, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. దీని ప్రభావంతో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Read Also: The Greatest Of All Time: ‘ది గోట్‌’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!

మరోవైపు గోదావరి నది వరద ప్రవాహం పెరుగుతుందని బుధవారం రాత్రి 8 గంటల నాటికి భద్రాచలం వద్ద 44.4 అడుగుల నీటిమట్టం ఉంది.. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,00,706 లక్షల క్యూసెక్కులు ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. అలాగే, కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని ప్రకాశం బ్యారేజి వద్ద 8 గంటల నాటికి 3.08 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ఇక, కృష్ణా, గోదావరి నదీ పరివాహాక ప్రజలు, లంక గ్రామ వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది, వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.