Site icon NTV Telugu

AP Cabinet: పాత మంత్రులకు పాత శాఖలే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం ఉత్కంఠకు తెరపడింది.. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఇక, కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌ను మంత్రులుగా ఇవాళ ప్రమాణం చేయనున్నారు. అయితే, గతంలో లానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుండగా.. మరోవైపు.. మంత్రులకు శాఖల కేటాయింపుపై కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.. పాత మంత్రుల్లో కొందరికి పాత శాఖలు కేటాయించే ఛాన్స్ ఉందంటున్నారు..

Read Also: Kakani Govardhan Reddy: కొందరికి బాధ ఉండొచ్చు.. అవసరం అయితే ఒక మెట్టు దిగుతా..

గతంలో మాదిరిగానే ఎస్సీ మహిళకే హోం శాఖ అంటూ ప్రచారం సాగుతోంది.. ఈ ఈక్వేషనులో తానేటి వనితకు హోం మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.. ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని కొనసాగించనున్నట్టుగా తెలుస్తుండగా.. కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూతో పాటు మరో కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది.. ఇక, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, నారాయణస్వామి, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌ గత శాఖలనే కొనసాగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. అయితే, ఫస్ట్‌ కేబినెట్‌లో చోటు దక్కకపోయినా.. ఈ సారి మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజాకు ఏ శాఖ కేటాయించనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది.. ఇక, కాకానికి వ్యవసాయం.. లేదా మరో కీలక శాఖ అని ఊహాగానాలు వినిపిస్తుండగా.. మంత్రుల శాఖల విషయంలో మధ్యాహ్నం లేదా సాయంత్రానికి క్లారిటి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఉదయం 11.31 గంటలకు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఐదు వేల మంది అతిథితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

Exit mobile version