జనసేన ఎమ్మెల్యేలకు ఇప్పుడు తత్వం బోథపడిందా? ఏడాదిగా ఎక్కడున్నారో… ఏం చేస్తున్నారో కూడా తెలియని వాళ్ళు సైతం ఇప్పుడు నియోజకవర్గాల బాటపట్టి… మేం పక్కా లోకల్ అంటున్నారా? ఉన్నట్టుండి అంత మార్పు ఎలా వచ్చింది? ఉలిక్కిపడి లేచినట్టు… వాళ్లంతా ఒక్కసారిగా ఎందుకు అలర్ట్ అయ్యారు? వాళ్ళని అలా పరుగులు పెట్టిస్తున్న అంశమేది? 2024 ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలిచాక…ఆ ఊపుతో ముందుకెళ్లాల్సిన జనసేన నాయకులు కొన్ని నియోజకవర్గాల్లో పత్తా లేకుండా పోతున్నారట. పార్టీ కార్యక్రమాలను పక్కనబెట్టి సొంత యాక్టివిటీస్‌లోమునిగితేలుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల్లో తిరక్కుండా కేవలం వ్యక్తిగత ప్రయోజనాల మీదే దృష్టి పెట్టారట కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు. ఏడాది నుంచి ఇష్టానుసారంగా వ్యవహరించిన జనసేన ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు సడన్‌గా యాక్టివ్ మోడ్‌కి రావడంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. పాత తీరు, పద్ధతిని మార్చుకుంటున్నారట. వాళ్ళలా ఉలిక్కిపడి లేచి పరుగులు పెట్టడం వెనక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. తాజాగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సీక్రెట్ సర్వేలు చేయించినట్లు సమాచారం.
ప్రజల్లో ఉంటున్నారా? పని చేస్తున్నారా? అనే ప్రశ్నలకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ బట్టి కొంతమందికి సీరియస్ క్లాస్ తీసుకున్నారట ఆయన. స్వయంగా అధినేతే… పిలిచి నివేదికలు ముందు పెట్టి తలంటేయడంతో… సదరు శాసనసభ్యులు అలర్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటికి, ఇప్పటికి వాళ్ళ తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందట. గడపదాటని వాళ్ళంతా ఇప్పుడు గ్రామాల్లో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారట. అధికారులతో సమావేశాల్ని కూడా పెంచేసినట్టు తెలుస్తోంది. మరోవైపు..నియోజకవర్గాల్లో టీడీపీ నేతల స్పీడ్‌ను చూస్తున్న జనసేన ఎమ్మెల్యేలు…మేం తక్కువేం కాదు… ఇక నుంచి చూస్కోండి అన్నట్టుగా దూకుడు పెంచారట. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిచోట గెలిచింది జనసేన. ఆ ఊపు, ఉత్సాహంతో… ఇంకేముంది… పార్టీ బేస్… రూరల్ నుంచి అర్బన్ దాకా స్ట్రాంగ్ అవుతుందని అనుకున్నారు అంతా.
కానీ కొందరు ఎమ్మెల్యేల వంకర బుద్దితో పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్న నివేదికలు అందాయట అధిష్టానానికి. అ తర్వాత పవన్ రిపోర్ట్స్ తెప్పించుకొని మరీ క్లాస్ పీకడంతో…మార్పు వచ్చిందని అంటున్నారు. తాను క్లాస్‌లు తీసుకున్నప్పటికి, తాజా పరిస్థితుల్ని బేరీజు వేసుకుని డిప్యూటీ సీఎం కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుటుంబ రాజకీయం చేస్తున్నారన్న నివేదికలతో ఆయనకు గట్టిగానే క్లాస్ పడిందట. వెంటనే యాక్టివ్ అయిన ఆరణి నియోజకవర్గంలో చురుగ్గా మారినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో వివాదాలకి కేంద్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడు టీడీపీ నేతలతో డిన్నర్ మీటింగ్స్ పెట్టుకుని మరీ… కలిసిపోదాం… రండి.. అంటున్నారట. ఇక కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లాంటి వారు కూడా ఇప్పుడు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటూ, అందరితో కలిసిపోయేలా పార్టీ ఒత్తిడి పెంచిందట. ఏడాదిగా హైదరాబాద్‌లో మకాం వేసి… అప్పుడప్పుడూ నియోజకవర్గాలకు వచ్చి వెళ్తున్న జనసేన శాసనసభ్యులు కొందరు ఇప్పుడైతే… మేం పక్కా లోకల్ అంటున్నట్టు సమాచారం. మొత్తం మీద.. ఆయనేం చెప్పారోగానీ… అధినేత వార్నింగ్స్ పార్టీ ఎమ్మెల్యేల మీద గట్టిగానే ప్రభావం చూపాయన్నది జనసేన వర్గాల మాట.
