NTV Telugu Site icon

YS Jagan vs YS Sharmila : అన్న చెల్లెళ్ళ యుద్ధంలో కొత్త కోణాలు.. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా.?

Jagan Otr

Jagan Otr

ఏపీలో వైసీపీ పరిస్థితి ఎద్దు పుండును కాకి పొడిచినట్టుగా తయారవుతోందా? అసలే ఘోర పరాజయ భారంతో ఉన్న అన్నని చెల్లెలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా? ఒకప్పటి అన్న వదిలిన బాణం ఇప్పుడు ఆయనకే రివర్స్‌ అయి చెప్పుకోలేని గాయాలు చేస్తోందా? కేవలం మాటలతో సరిపెట్టకుండా… అసలు ఏకంగా వైసీపీని బలహీనపరిచే ప్లాన్‌ రూపుదిద్దుకుంటోందా? అన్నా చెల్లెళ్ళ యుద్ధంలో కొత్త కోణాలేంటి? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? చెప్పులోని రాయి.. చెవిలోని జోరిగ.. కంటిలోన నలుసు.. కాలి ముల్లు…. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అంటారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ పరిస్థితి ఇప్పుడు ఇలాగే తయారైందట. ఏం చేద్దామన్నా.. నోరు తెరిచి ఏం మాట్లాడాలన్నా…. ఒకటికి రెండు సార్లు తరచి తరచి చెక్‌ చేసుకోక తప్పడం లేదంటున్నారు. అలాగని ఆయన భయం అధికార తెలుగుదేశం పార్టీ గురించి కాదట. అంతకు మించి ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలి హోదాలో… తోడబుట్టిన చెల్లి షర్మిల ఎలా రియాక్ట్‌ అవుతారోనంటూ జగన్‌ శిబిరం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందన్న చర్చ జరుగుతోంది. అందుకే… శతృవులు ఎక్కడో ఉండరన్న రావు రమేష్‌ సినిమా డైలాగ్‌ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారట. జగన్ ఢిల్లీ వెళ్లి ధర్నా చేసినా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఆఖరికి తాను అసెంబ్లీకి వెళ్లకున్నా… వెంటనే… ఇంకా చెప్పాలంటే టీడీపీకంటే ముందే షర్మిల వైపు నుంచి కౌంటర్స్‌ పడిపోతున్నాయి. అవి కూడా అలా ఇలాకాదు… బెత్తం పట్టుకుని నాలుగు తగిలించినట్టుగా, లాగిపెట్టి ఛెళ్ళుమని కొట్టినట్టుగా ఆమె కౌంటర్స్‌ ఉంటున్నాయన్నది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. ఒక్క ముక్కలో చెప్పాలంటే… చెల్లెలు పొలిటికల్‌గా అన్నకు పంటికింద రాయిలా మారారన్నది పార్టీ వర్గాల విస్తృత అభిప్రాయం. ఆ మధ్య ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తే.. కాంగ్రెస్ మద్దతివ్వలేదు.

అందుకు కారణం చంద్రబాబేనని జగన్‌ అనడంతో.. చివ్వున లేచారు షర్మిల. తనదైన శైలిలో అన్నను టార్గెట్‌ చేస్తూ చెలరేగిపోయారామె. ఒక క్రైస్తవుడిగా ఉండి… మణిపూర్‌లో క్రైస్తవులను ఊచకోత కోస్తే స్పందించలేదు.. అధికారం కోల్పోయాక అన్నీ గుర్తుకు వస్తున్నాయా అంటూ అన్న మీద మండిపడ్డారు షర్మిళ. అలాగే అసలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని వైసీపీ అధ్యక్షుడిని నిలదీశారు పీసీసీ చీఫ్. దీంతో ఆమె చంద్రబాబుకు కోవర్టుగా వ్యవహరిస్తున్నారంటూ.. ఎదురుదాడి మొదలుపెట్టారు వైసీపీ లీడర్స్‌. చంద్రబాబు, టీడీపీకి ఏ కష్టం వచ్చినా.. షర్మిల అడ్డం వెళ్తున్నారంటూ ఘాటుగానే రియాక్ట్‌ అయ్యారు. కానీ.. అందుకు ఆమె కూడా ఏ మాత్రం తగ్గకుండా… రివర్స్‌ కౌంటర్స్ వేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళి జనం సమస్యల గురించి మాట్లాడమంటే… నామీద అపవాదులు వేస్తారా..? అంటూ ఘాటుగానే ట్వీట్‌ చేశారు. ఇలా అనేక అంశాల మీద కుదిరితే నేరుగా… లేదంటే ఎక్స్‌లో వైసీపీని టార్గెట్‌ చేస్తున్నారామె. దీంతో వైసీపీకి.. షర్మిల అతి పెద్ద సమస్యగా మారారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. పైకి చెప్పుకోలేరు.. అలాగని సైలెంటుగా ఉండలేరు అన్నట్టుగా మారిందట ఫ్యాన్‌ పార్టీ పరిస్థితి. గట్టిగా ఏదన్నా మాట్లాడదామా..? అంటే చెల్లెలు అయిపోయారు.. దీంతో ఏం చేయాలో పాలుపోక.. తెలుగుదేశం పార్టీతో అంటకాగుతున్నారనే ముద్రనే వీలైనంత బలంగా ప్రజల్లోకి తీసుకెళదామన్న ఆలోచనలో ఉన్నారట వైసీపీ పెద్దలు. అయితే.. ఆ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీసీసీ ప్రెసిడెంట్‌.

కౌంటర్లు వేసే విషయంలో.. విమర్శించేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారామె. ఓవైపు తెలుగుదేశం పార్టీకి గట్టిగా కౌంటర్లు ఇస్తూనే.. మరోవైపు వైసీపీని చెడుగుడు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం విధి విధానాల విషయంలో షర్మిల విమర్శంచాకే ప్రభుత్వం కూడా స్పందించింది. అప్పటి వరకు ఆ సబ్జెక్ట్‌ మీద వైసీపీ వైపు నుంచి గట్టిగా కౌంటరే పడలేదు. అలాగే వరద ప్రాంతాల్లో అందరికంటే ముందుగా పర్యటించారు ఆమె. నీళ్లలోకి దిగిమరీ… రైతుల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా.. సాయం విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ విషయంలో అసలు ఇప్పటిదాకా వైసీపీ దగ్గర కార్యాచరణే లేదంటున్నారు. ఇక షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకోవడానికి మరో కారణం కూడా ఉందన్న భావన వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో పుంజుకోవాలంటే కచ్చితంగా వైసీపీని డామేజ్ చేసి తీరాలనేది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకు పొరుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సహకరించే అవకాశం కన్పిస్తోందంటున్నారు పరిశీలకులు. ఆ క్రమంలోనే వైసీపీలో ఉన్న కొందరు పాత కాంగ్రెస్‌ కీలక నేతలను ఘర్ వాపసీ పేరుతో తిరిగి రప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. జగన్ పార్టీని సక్రమంగా నడిపించలేకపోతున్నారనే ఫీలింగ్ కల్గించే ప్రక్రియలో భాగంగానే షర్మిల అన్నపై ఓ రకంగా యుద్ధం ప్రకటించారన్న భావన వ్యక్తం అవుతోంది రాజకీయవర్గాల్లో. ఏది ఏమైనా.. ఏపీలో అన్నాచెల్లెళ్ల వార్‌ మాత్రం టాక్‌ ఆఫ్‌ ది పొలిటికల్‌ సర్కిల్స్‌ అవుతోంది. ఒకప్పుడు అన్న వదిలిన బాణంగా పేరున్న పీసీసీ ప్రెసిడెంట్‌.. ఇప్పుడు ఎదురు తిరిగిన బాణంగా ఎంతవరకు సక్సెస్‌ అవుతారన్న చర్చ జరుగుతోంది.