NTV Telugu Site icon

Nedurumalli Ramkumar Reddy: ఎమ్మెల్యే ఆనంపై నేదురుమల్లి కౌంటర్‌ ఎటాక్.. పవన్‌ ఆ మాట ఎందుకన్నాడు..?

Nedurumalli Ramkumar Reddy

Nedurumalli Ramkumar Reddy

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… తాజాగా, ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి చేసిన కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.. ఎవరైనా ఏమైనా మాట్లాడితే వెంటనే స్పందించడం, దాని జోలికి పోవడం నాకు అలవాటు లేదన్న ఆయన.. కానీ, ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను.. స్పందించాల్సిన బాధ్యత నాపై ఉందంటూ ఆనం కామెంట్లకు కౌంటర్‌ ఇస్తూ.. ఆనం రాంనారాయణరెడ్డి కూడా వైసీపీ బీ ఫామ్‌పై గెలిచారు. వెంకటగిరిలో సంక్షేమ పథకాలు కాకుండా, రూ.15 వందల 96 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. నా పేరు చెప్పకుండా నన్ను పెద్దమనిషిగా సంభోదించడం సంతోషంగా ఉందన్నారు. 2014లో నేను వెంకటగిరి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశాను.. ఎన్నికలు జరిగిన తర్వాత రోజే నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి చనిపోయారు.. అందువల్లే నేను కొన్ని రోజులు వెంకటగిరికి దూరంగా ఉన్నాను.. ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమి ఇరగదీశామో తెలుసుకోవాలి.. నేను ఒడిపోయినా వెంకటగిరి వదిలిపోలేదని స్పష్టం చేశారు.

Read Also: Sankranti Lucky Draw: సంక్రాంతి లక్కీ డ్రా..! మంత్రి అంబటిపై పోలీసులకు ఫిర్యాదు

ఇక, మీరు టీడీపీలో చేరి ఆత్మకూరులో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారంటూ ఆనంపై మండిపడ్డారు నేదురుమల్లి.. నెల్లూరు సిటీ నుంచి పోటీచేయాలనే కదా మీరు ఆనం వివేకానంద రెడ్డి జయంతిని అట్టహాసంగా జరిపారరి నిలదీశారు.. మరోవైపు, ఆనం మంచి వ్యక్తి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు వ్యాఖ్యానించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కన్నా కేబినెట్‌ హోదా పెద్దదని మీకు తెలియదా? అని ఎద్దేవా చేశారు.. అసలు, నేదురుమల్లి పేరు విన్నా.. నా ఫోటో చూసినా మీకు ఎందుకు అంత భయం అంటూ కౌంటర్‌ ఇచ్చారు.. మునిసిపాలిటీలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయో మీకు తెలియదా ? అంటూ ఎమ్మెల్యే ఆనంను నిదీశారు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి.

కాగా, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం విదితమే.. తిరుపతి జిల్లా డక్కిలిలో వైసీపీ సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. నేను ఎమ్మెల్యేనో కాదో చెప్పండి అంటూ సమావేశానికి హాజరైన పార్టీ పరిశీలకుడ్ని అడిగారు. అసలు.. తాను ఎమ్మెల్యేనో కాదో అనే అనుమానం వస్తోందన్న ఆయన.. లేకపోతే వెంకటగిరి అభ్యర్థిగా కొత్తవారిని ఎవరినైనా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిందా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల ప్రాతిపదికన వెంకటగిరి ప్రజలు తనకు ఓటేస్తే గెలిచానని, మరో సంవత్సరం పాటు తానే ఎమ్మెల్యేనని, కానీ, ఓ పెద్దమనిషి అప్పుడే తాను ఎమ్మెల్యే అయిపోయినట్టుగా మాట్లాడుతున్నారంటూ ఆనం రామనారాయణరెడ్డి మండిపడ్డారు. ఆ వ్యక్తి గతంలోనూ తానే ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకుని సగంలోనే పారిపోయారని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అయితే, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు, తిరుపతి వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కూడా వెంకటగిరి స్థానం ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Show comments