Site icon NTV Telugu

Andhra Pradesh: మహిళా సీఐ తీరుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

National Women Commission

National Women Commission

Andhra Pradesh: ఇటీవల శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు రాంనగర్ కాలనీకి చేరుకున్న ఆమె నిందితుడి భార్య పట్ల శారీరకంగా దాడి చేశారు. అతడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ హింసించారు. సదరు మహిళను దూషిస్తూ బలవంతంగా పోలీస్ వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. తనను సీఐ అంజు యాదవ్ తన్నారంటూ ధనలక్ష్మీ అనే మహిళ ఆరోపించింది. అంతేకాకుండా మహిళను కాలితో తన్నుతూ చీర లాగి, జుట్టు ప‌ట్టుకుని వివ‌స్త్రను చేసిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. దీంతో శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా మూడు రోజుల కిందట జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై పోలీసుల దౌర్జన్యాలు. మహిళా పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళలపై క్రూరంగా దాడులు చేస్తున్నారు.దయ చేసి కఠిన చర్యలు తీసుకోండి’ అని జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల సంఘాలను ట్యాగ్ చేస్తూ వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, తప్పు చేసిన పోలీసులను అరెస్ట్ చేయాలని డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. ఈ విషయంలో కాలపరిమితితో కూడిన విచారణ చేయాలని, బాధితురాలికి ప్రభుత్వం ఉత్తమ వైద్య చికిత్సను అందించాలని ఆదేశించినట్లు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.

మరోవైపు ఎస్పీ ఆదేశాలతో సీఐ అంజూయాదవ్‌ను ఏఎస్పీ విమలకుమారి ప్రశ్నించగా.. తాను ఉద్దేశపూర్వకంగా మహిళపై దాడి చేయలేదంటూ సీఐ అంజుయాదవ్ ఓ ఆడియో విడుదల చేశారు. తాను ఏ తప్పు చేయలేదని.. బాధితురాలు మర్యాదగా మాట్లాడలేదని.. తాను ఎక్కడా ఆమెను కొట్టలేదని… కావాలనే బాధితురాలు ఇలా చేస్తోందని సీఐ ఆరోపించారు. తాను ఎంత బాగా పనిచేస్తాను అన్నది అందరికీ తెలుసు అని.. తాను పాతికేళ్లుగా ఉద్యోగంలో ఉన్నానని వివరించారు.

Exit mobile version