NTV Telugu Site icon

మంగళగిరి ఎమ్మెల్యే ఓ గెస్ట్ లెక్చరర్: నారా లోకేష్

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆర్కే గెస్ట్ లెక్చరర్‌గా మారారని ఎద్దేవా చేశారు. వారానికి ఒకసారి నియోజకవర్గానికి వచ్చి నాలుగు ఫోటోలు దిగి జంప్ అవుతున్నారంటూ లోకేష్ ఆరోపించారు. గురువారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. రకరకాల కారణాలు చెబుతూ దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్లు కట్ చేస్తున్నారని లోకేష్ వద్ద పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: టీడీపీ-జనసేన పొత్తు..! సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు

30 ఏళ్ల క్రితం ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు వన్ టైం సెటిల్‌మెంట్ అంటూ రూ.10 వేలు కట్టమని జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత.. సొంతిల్లు ఉందనే కారణం చూపి పెన్షన్, రేషన్ కార్డ్, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఆపేయడం ఖాయమని ఆరోపించారు. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం పేదలను దోచుకుంటోందని… టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.