Site icon NTV Telugu

Nara Lokesh: ఇంకెన్నాళ్లు మీ అరాచ‌కాలు జగన్ రెడ్డి గారూ..?

Nara Lokesh

Nara Lokesh

సోషల్ మీడియా వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా తమకు ఓటు వేయని ఓ ఇంటిని వైసీపీ నేత కబ్జా చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన ప్రస్తావించారు. ప్రకాశం జిల్లా క‌నిగిరి మండ‌లం గానుగ పెంటలో మేకల కాపరి మ‌ర్రి శ్రీను ఇంటిని వైసీపీ నేతలు కబ్జా చేశారని లోకేష్ ఆరోపించారు. తమకు ఓటేయ‌క‌పోతే వేటు వేయ‌డం వైసీపీ న‌యా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని నారా లోకేష్ చురకలు అంటించారు. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో త‌మ అభ్యర్థుల ఏక‌గ్రీవానికి ఒప్పుకోక‌ుంటే చేసిన అరాచకాలు చూశామని.. స్థానిక ఎన్నికల్లో వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్‌లు, హ‌త్యలు చేయ‌డం చూశామని.. ఎన్నిక‌లై చాలా రోజులైనా టీడీపీకి ఓట్లేశార‌ంటూ మ‌ద్దతు ప‌లికార‌నే క‌క్షతో ఇప్పటికీ వైసీపీ నేత‌లు నానా ఇబ్బందుల‌కు గురిచేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

Read Also: Janasena Party: రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. తేదీలు షురూ

స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసి త‌న ఓట‌మి కార‌ణం అయ్యాడ‌నే క‌క్షతో మర్రి శ్రీను ఇంటినే క‌బ్జా చేశారని లోకేష్ విమర్శలు చేశారు. అధికారం అండ చూసుకుని ఏకంగా ఇల్లు ఆక్రమించేయ‌డంతో ఆ కుటుంబం రోడ్డున ప‌డిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు మీ అరాచ‌కాలు జగన్ రెడ్డి గారూ.. ప్రజ‌లు తిర‌గ‌బ‌డ‌క‌ముందే ఇటువంటి క‌బ్జాలు, అరాచ‌కాలు మానాలంటూ నారా లోకేష్ హితవు పలికారు.

Exit mobile version