2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్ చేశారని నారా లోకేష్ విమర్శించారు.
ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను పెంచి అడ్డగోలుగా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోందని నారా లోకేష్ విమర్శించారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీల పేరుతో బాదుడే బాదుడు జరుగుతోందని.. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్‌గా మారిపోయిందని నారా లోకేష్ విమర్శలు చేశారు.
