Site icon NTV Telugu

Nara Lokesh: జగన్ దావోస్ టూర్‌పై సెటైర్లు.. ఎవరైనా మా నాన్న మార్గంలో నడవాల్సిందే..!!

Nara Lokesh

Nara Lokesh

ఏపీ సీఎం జగన్‌ దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదిక‌గా విమ‌ర్శలు చేశారు. గ‌తంలో ఏపీ సీఎం హోదాలో ఈ స‌ద‌స్సుల‌కు చంద్రబాబు హాజ‌రైన విష‌యాన్ని గుర్తు చేస్తూ జ‌గ‌న్‌ ప‌ర్యట‌న‌పై సెటైర్లు సంధించారు. గతంలో సీఎం హోదాలో చంద్రబాబు దావోస్‌లో పర్యటిస్తే.. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ ఇప్పుడు ఏకంగా స్పెషల్ విమానంలో ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో అంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. తన తండ్రి చంద్రబాబును ద్వేషించే వారు, విమర్శించే వారు సైతం చివరకు ఆయన మార్గంలో నడవాల్సిందేనని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సంక్షేమం నుండి ఐటీ వరకూ.. అమరావతి నుండి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం అంటూ లోకేష్ వివరించారు.

మరోవైపు ఏపీలో దళితులపై జరుగుతోన్న దాడులు, అరాచకాలపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు నారా లోకేష్ లేఖలు రాశారు. రాష్ట్రంలో ఎస్సీలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు లేవని ఆయన ఆరోపించారు. దళితుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో ఏపీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని.. ప్రజల్లో అభద్రతా భావం పెంచేలా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని లోకేష్ విమర్శించారు. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రమణ్యం వరకూ దళితులపై వైసీపీ నేతల దమనకాండ కొనసాగుతూనే ఉందన్నారు. దళితుల హత్యలు మిస్టరీ హత్యలుగా మిగిలిపోతున్నాయని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంత బాబుని వెంటనే అరెస్ట్ చేసి దళిత యువకుడు సుబ్రమణ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Exit mobile version