NTV Telugu Site icon

Nara Lokesh: ‘అమ్మ ఒడి’పై లోకేష్‌ సెటైర్లు.. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి..!

ప్రభుత్వ పథకాలు, విధానాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అమ్మ ఒడి పథకంపై సెటైర్లు వేశారు.. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది సీఎం వైఎస్‌ జగన్ అమ్మ ఒడి పథకం తీరు అని దుయ్యబట్టారు.. తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్థ ఒడిగా మారిన పథకంపై ఇప్పుడు ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి పథకం మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేశారని ఆరోపించారు..

Read Also: MMTS Services: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. సర్వీసులు పెంచిన ఎంఎంటీఎస్..

300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే పథకం కట్ అంటూ కొత్త నిబంధన పెట్టారని విమర్శించారు నారా లోకేష్‌.. ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ వర్తిస్తాయని ముందే ఎందుకు చెప్పలేదు..? అని నిలదీశారు.. జగన్ మోసపు రెడ్డి గారు? మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారు అని మండిపడ్డారు.. ఇక, అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు నారా లోకేష్‌.