Site icon NTV Telugu

Nara Lokesh: జగన్‌ కి నవ్వుతూ అబద్ధాలు ఆడడం అలవాటు

ఏపీ సీఎం జగన్‌ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. మీడియాతో లోకేష్ చిట్ చాట్ చేశారు. నాలుగు రోజులైనా జంగారెడ్డి గూడెం మరణాలపై నాలుగు రోజుల పాటు సాగదీస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శలు అర్ధరహితం. ప్రజల ప్రాణాలకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. ప్రజా సమస్యలపై మేం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. సీఎం జగన్ అబద్దాలకు అలవాటు పడ్డారు.

నవ్వుతూ అబద్దాలు ఆడడం జగనుకు అలవాటైంది. జంగారెడ్డి గూడెం కల్తీ మరణాలు సహా అన్ని విషయాల్లోనూ సీఎం జగన్ అలవోకగా అబద్దాలు ఆడేస్తున్నారు. పేదల ప్రాణాలంటే జగనుకు ఎంత లోకువో జంగారెడ్డి గూడెం వరుస మరణాల ఘటనతో స్పష్టమైంది. జంగారెడ్డి గూడెంలోవి సహజ మరణాలైతే ఎఫ్ఐఆర్లు ఎందుకు నమోదు చేశారు..? సారా బట్టీలపై ఎస్ఈబీ ఎందుకు దాడులు చేశారు..? టీడీపీ హయాంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలోనూ అలవాటు ప్రకారం జగన్ అబద్దాలాడేశారు.

ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి ప్రమోషన్లు ఇచ్చారంటూ మాపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, ప్రధానిలకే అబద్దాలు చెప్పగలిగిన ఘనుడు జగన్. పెగాసస్ సాఫ్ట్ వేరును టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడూ అనుమతించరు. పెగాసెస్ సాఫ్ట్ మేం కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా..? అని లోకేష్ ప్రశ్నించారు.

మా హయాంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే.. మాపై చర్యలు తీసుకోకుండా జగన్ మూడేళ్ల పాటు ఆగి ఉండేవారా..? టీడీపీ తప్పులు వెతకడానికి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారు. టీడీపీ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ నిజంగానే కామెంట్ చేసి ఉంటే.. ఆమెకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు. వ్యవస్థలు శాశ్వతమని నమ్మే వ్యక్తి చంద్రబాబు. సహజంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఒప్పందాలు చేసుకుంటారు.. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. వ్యవస్థలు శాశ్వతమని నమ్మే వ్యక్తి కాబట్టే సీఆర్డీఏ చట్టాన్ని రైతులకు అనుకూలంగా చేశారు.

చంద్రబాబు ముందు చూపు వల్లే సీఆర్డీఏ చట్టం గెలిచింది. రాజధానిపై ప్రభుత్వానికే స్పష్టత లేదు.. మాకు స్పష్టత ఉంది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని మా విధానం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. పరిపాలన కేంద్రీకృతంగా ఉండాలన్నారు లోకేష్.

https://ntvtelugu.com/sailajanath-demands-judicial-enquiry-on-jangareddy-gudem-issue/
Exit mobile version