Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్

  • రాజకీయాల్లో 13 ఏళ్లు పూర్తి
  • యువగళం పాదయాత్ర కీలక మలుపు
  • యువతకు భారీగా ఉద్యోగాలే లక్ష్యం
  • విద్యారంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం : నారా లోకేష్
Nara Lokesh

Nara Lokesh

రాజకీయాల్లోకి అడుగుపెట్టి 13 ఏళ్లు పూర్తయిందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ప్రయాణం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని ఎక్స్  వేదికగా ఆయన పేర్కొన్నారు. గడిచిన పదమూడేళ్లలో ఎదురైన అనుభవాలు, ప్రజల మధ్య సాగిన మమేకం, భవిష్యత్తు కార్యాచరణ గురించి లోకేష్ తన పోస్ట్‌లో వివరించారు. పార్టీ నిర్మాణం నుంచి ప్రజాసేవ వరకు సాగిన ఈ ప్రస్థానం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మరింత బాధ్యతతో ముందుకు సాగే స్ఫూర్తిని ఇచ్చిందని ఆయన వెల్లడించారు.

యువగళం పాదయాత్ర జ్ఞాపకాలు

తన రాజకీయ ప్రయాణంలో యువగళం పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిందని లోకేష్ గుర్తుచేసుకున్నారు. పాదయాత్రలో 3,132 కిలోమీటర్లు నడిచానని, ఆ క్రమంలో రాష్ట్రంలోని ప్రజల కష్టసుఖాలను, ఆకాంక్షలను దగ్గరగా చూశానని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై సాగిన ఆ నడక తనకు ఎంతో బలాన్ని, స్పష్టతను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటికి పరిష్కారాలు చూపే దిశగా ఈ అనుభవం దోహదపడిందని చెప్పారు.

ఉద్యోగాలు, విద్యారంగంపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును బలోపేతం చేసే దిశగా కీలక లక్ష్యాలను లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెద్దఎత్తున ఉద్యోగాలు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను విద్యారంగంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలపడమే తమ ధ్యేయమని చెప్పారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

జీటీఏ-6 అభిమానులకు శుభాకాంక్షలు

తన 13 ఏళ్ల రాజకీయ ప్రయాణ విశేషాలను పంచుకోవడంతో పాటు, ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమింగ్ ప్రియులనూ లోకేష్ పలకరించారు. జీటీఏ-6 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ అంశాలతో పాటు యువత ఆసక్తులను కూడా గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తించింది.