Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Srisailam Temple

Srisailam Temple

Srisailam Temple: సోమవారం శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.. అది శ్రావణమాసం అయితే.. మరి ఎక్కువ.. ఇక, శ్రావణమాసం ముగింపునకు వస్తుందంటే.. రద్దీ మరింత పెరుగుతుంది.. శ్రావణమాసం ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా నేడు శ్రావణ సోమవారం కావడంతో తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా శ్రీశైలం క్షేత్రానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

నిన్న ఒక్కరోజే శ్రీ స్వామి, అమ్మవార్లను 42,078 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నేడు కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దర్శనానికి రద్దీ పెరిగింది. క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్‌లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ నేపథ్యంలో అభిషేకం, స్పర్శ దర్శనం, కుంకుమార్చన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

ప్రస్తుతం శ్రీ స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రొటోకాల్ సిఫార్సులతో వచ్చే భక్తులకు మాత్రం రాత్రి 8.30 గంటలకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం వెల్లడించింది. శ్రీశైలంలో జరుగుతున్న శ్రావణ మాసోత్సవాలు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో మిగిలిన రోజుల్లోనూ భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.