Site icon NTV Telugu

Fake Ornaments: వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాలు.. అసలు నగలు మాయం..!

Fake Ornaments

Fake Ornaments

Fake Ornaments: వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వేంకటేశ్వర స్వామికి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం కలకలం రేపింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం (సోమవారం) రోజున స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా, అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించడంతో ఈ బాగోతం బయటపడింది. ఆలయానికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు మొత్తం 5.83 కిలోలు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Read Also: Mahatma Gandhi Cancer Hospital: ఆధునాతన టోమోథెరపీ రాడిక్సార్ట్ X9 ప్రారంభించిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆలయ ఈవో సాయి జయచంద్ర రెడ్డి వెంటనే ఆలయానికి చేరుకుని నగలను పరిశీలించారు. గత ఈవో తనకు చార్జ్ అప్పగించలేదని, అందుకే ఆభరణాల లెక్కలు సక్రమంగా అందలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఈవో తెలిపారు. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో అలంకరణ చేయడం ఆనవాయితీ. దర్శనం పూర్తైన తరువాత నగలను ఆలయంలోని బీరువాలో భద్రపరిచే బాధ్యతను ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ నిర్వహిస్తున్నారు.

అయితే, ఆలయంలోని వెండి నగలు మాయమవడం వెనుక రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు కిషోర్ శర్మ పాత్ర ఉన్నట్లు వ్యాపార, భక్త వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డి పేరూ చర్చలోకి రావడంతో పోలీసులు ఆయన్ను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రిటైర్డ్ ఈవో నర్సయ్య, అర్చకుడు మామిడి కిషోర్ శర్మ, ప్రస్తుత ఈవో సాయి జయచంద్ర రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.. ఆలయ నగల భద్రతలో భారీ లోపాలు ఉన్నాయా? అసలు నగలు ఎక్కడికి వెళ్లాయి? నకిలీ నగలు ఎవరు తెచ్చారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆలయ ఆభరణాల వ్యవహారం అత్యంత సున్నితమైనది కావడంతో, ఆధారాలు లేకుండా ఎవ్వరినీ దోషులుగా నిర్ధారించలేమని పోలీసులు చెబుతున్నారు. విచారణ పూర్తైన తరువాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.

Exit mobile version