పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడారా..? అని ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ఉద్యమకారులకు సంఘీభావం తెలపడానికే పవన్ కళ్యాణ్ దీక్ష అని పేర్కొన్నారు. ఢిల్లీకి అఖిపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎం జగనుకు పవన్ లేఖ రాశారని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అవసరం లేదని కేంద్రానికి ఇప్పటికే చెప్పాం.. ఇంకా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి మేం తీసుకెళ్లామని… అమిత్ షాతో పాటు.. బీజేపీతో జరిపే అనేక సమావేశాల్లో ప్రైవేటీకరణ చేయొద్దనే విషయాన్ని పవన్ స్వయంగా కోరారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రైవేటీకరణ చేయదని జనసేన బలంగా నమ్ముతోందని… మోడీ నాయకత్వాన్ని నమ్ముతున్నాం.. చక్కగా దేశాన్ని పాలిస్తున్నారన్నారు నాదెండ్ల మనోహర్.
