NTV Telugu Site icon

MVR: అనకాపల్లి రేసులోకి ఎంవీఆర్..? ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ..!!

MVR

MVR

ఎన్నికల సమయంలో చాలా మంది రాజకీయ నేతలు టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతుంటారు. ప్రజాసేవ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. తమకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తామని పార్టీ అధినేతలకు చెప్తుంటారు. ఇప్పుడు అనకాపల్లిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముత్యాల వెంకటేశ్వర రావు (ఎంవీఆర్) ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ పలు పార్టీలు ఆయన్ను రాజకీయాల్లోకి రావాలని కోరాయి. కానీ ఎంవీఆర్ అంగీకరించలేదు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని తెలియగానే రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన రాకను స్వాగతించాయి. పార్టీల్లో చేరాలని ఆహ్వానం పలికాయి. అయితే గెలిచే పార్టీలోనే చేరాలనే ఉద్దేశంతో ఎంవీఆర్ సర్వేలు చేయించుకుంటున్నారు. ఒకవేళ రాజకీయ సమీకరణాలతో ఆయనకు టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ముత్యాల వెంకటేశ్వర రావు అలియాస్ ఎంవీఆర్ కాపు సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త. వ్యాపారవేత్తగా ఆయన నియోజకవర్గంలో ఎంతోకాలంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరధిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. ఆ తర్వాత యాదవులదే ఆధిపత్యం. అందుకే ఇక్కడ కాపు సామాజిక వర్గ నేతలు బరిలో ఉండేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎంవీఆర్ ను పోటీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీలను కూడా గెలిపించుకోగల సత్తా ఉందని చెప్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తన వ్యాపారాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉండడం ఎంవీఆర్ కు కలిసొచ్చే అంశం. ఉత్తరాంధ్ర నిరుద్యోగులు ఎంతోమందికి ఆయన సొంతంగా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించారు. వ్యాపారవేత్తగా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ఎంవీఆర్ కు మంచి పలుకుబడి ఉంది. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, కేరళలో కూడా ఎంవీఆర్ కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.

ఎంవీఆర్ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఆపరేషన్లకు సాయం చేయడం లాంటివి నిత్యం ఆయన చేపడుతుంటారు. ఎంవీఆర్ కు భక్తి ఎక్కువ. అందుకే ఆరు నెలలపాటు ఆయన దీక్షలోనే ఉంటారు. ఏడాది పొడవునా దైవిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆలయాలను పునరుద్ధరించడం, కల్యాణాలు నిర్వహించడం ఆయనకు ఇష్టమైన పనులు. ఇలా అన్నివర్గాల అభిమానాన్ని చూరగొన్న ఎంవీఆర్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.

Show comments