NTV Telugu Site icon

Viral Fevers: ముండ్లమూరుని వణికిస్తున్న విషజ్వరాలు

Viral Fevers

Viral Fevers

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం బసవాపురంలో విషజ్వరాలు జనాన్ని వణికిస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో 150 మందికి పైగా జ్వర పీడితులు వున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. పది రోజుల క్రితం విష జ్వరంతో ఎస్సీ కాలనీకి చెందిన గురవమ్మ అనే మహిళ మృతి చెందింది. ప్రతీ ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వర పీడితులు వున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వర పీడితులు జాయిన్ అవుతున్నారు. దర్శి, అద్దంకి, ఒంగోలు ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు బాధితులు.

Read Also: Swami Vivekananda: లాటిన్ అమెరికా దేశంలో తొలిసారి వివేకానందుడి విగ్రహ ఆవిష్కరణ

విష జ్వరాలకు గ్రామంలో పారిశుధ్య సమస్యలు కారణమంటున్నారు గ్రామస్తులు..గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పెద్ద ఉల్లగల్లు, ఉమామహేశ్వరపురం అగ్రహారంలో వందలమంది మంచం పట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు దోమల వ్యాప్తితో గ్రామస్తులు విషజ్వరాల బారినపడ్డారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని, మందులు సరఫరా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.ముండ్లమూరులో మురుగు నీరు రోడ్లపై యథేచ్ఛగా పారుతోంది.

కొద్దిపాటి వర్షానికి సిమెంట్‌ రోడ్లపై మురుగునీరు నిల్వ వుంటోంది. పారిశుద్ధ్య సమస్యలతో తాము నానా ఇబ్బందులు పడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు వేశారు గాని సైడు కాలువలో పేరుకుపోయిన మురుగు మట్టిని తీసిన పాపాన పోలేదు అంటున్నారు ప్రజలు. ఒకవైపు సైడ్‌ కాలువ అసలే లేదు. దీంతో నానా అవస్థలు పడుతూ రోగాల బారిన పడుతున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మంచాన పడినా అధికారుల్లో కదలిక లేదంటున్నారు.

Read Also: Pineapple Ganesh:తిరుపతిలో వెరైటీ… పైనాపిల్ గణేష్ కి భారీ లడ్డూ