MPDO Association leaders meets cm jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్‌ను సన్మానించారు.
అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోలకు పదోన్నతులను సీఎం జగన్ ఇచ్చారని.. కొత్తగా 51డీఎల్డీవో పోస్టులు సృష్టించి ఏప్రిల్ నెలలో పదోన్నతులు ఇచ్చారన్నారు. జిల్లాల విభజన ప్రక్రియ వల్ల ఏప్రిల్‌లో ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వలేకపోయారని తెలిపారు. వెంటనే ఎంపీడీవోలకు పదోన్నతులు ఇవ్వాలని ఇటీవలే సీఎం ఆదేశించారని.. అర్హత కల్గిన ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పిస్తూ వ్యక్తిగతంగా అన్ని జిల్లాలకు గురువారం నాడు సీఎం ఆదేశాలు పంపారని పేర్కొన్నారు. పదోన్నతులు కల్పించినందుకు సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించాలని సీఎంను కోరామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు సీఎం జగన్ అంగీకరించారని వెల్లడించారు.
Read Also: MP Gorantla Madhav Video Issue: ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా.. ఆ వీడియో ఫేక్ అని ఎలా చెబుతారు..?
అటు ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఎంపీడీవోలుగా పని చేసినా పదోన్నతులు రాలేదని.. ఎన్నో ఏళ్లు తిరిగినా ఎవరూ పదోన్నతులు ఇవ్వలేదని.. సీఎం జగన్ మాకు పదోన్నతులు కల్పించారని కొనియాడారు. 237 మందిని జిల్లా డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చారని చెప్పారు. సీఎం జగన్ కు ఎంపీడీవోల తరపున ధన్యవాదాలు తెలియజేశామని పేర్కొన్నారు. ఎంపీడీవోలకు డిప్యూటీ డైరెక్టర్లుగా సీఎం జగన్ పదోన్నతులు ఇచ్చారని.. 12వేల పైగా మంది ఉద్యోగులకు భవిష్యత్తులో పదోన్నతులు వస్తాయని జనరల్ సెక్రటరీ,ఎంపీడీవోల సంఘం నారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులకూ పదోన్నతులకు మార్గం సుగమమైందని.. సీఎం జగన్ సహా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
