NTV Telugu Site icon

Guntur Zp meeting: నిస్సారంగా సాగిన గుంటూరు జెడ్పీ మీటింగ్

Zp Meeting

Zp Meeting

గుంటూరు జిల్లాలో ప్రజాసమస్యలపై చర్చించి.. వాటికి పరిష్కారం చూపాల్సిన ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిస్సారంగా సాగింది. ఈసమావేశంలో ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో డుమ్మా కొట్టడంతో అనేక సమస్యల ప్రస్తావన లేకుండానే సమావేశం ముగించాల్సి వచ్చింది …. ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ,ఓఎమ్మెల్యే మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశంలో కౌలు రైతుల సమస్య ,స్కూళ్ల విలీనం, మిర్చి రైతులకు నష్టపరిహారం వంటి సమస్యల పరిష్కారానికి సభ్యులు పలు సూచనలు చేశారు.

గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్నసమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు సభ్యులు. అయితే ఈ సమావేశానికి మంత్రుల హోదాలో అంబటి రాంబాబు, విడదల రజిని, మేరుగు నాగార్జున హాజరయ్యారు. ఎమ్మెల్యే హోదాలో ఒక్క కిలారు రోశయ్య మాత్రమే జెడ్పీ సమావేశానికి హాజరయ్యారు.. మిగిలిన 13 మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు ….దీంతో సమావేశం చడీ చప్పడు లేకుండా నిస్సారంగా సాగిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

జిల్లా పరిషత్ కు సంబంధించి అనేక సమస్యలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. కేవలం సూచనలు మాత్రమే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామంటూ సమావేశాన్ని ముగించారు. ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి పరిషత్ సమావేశంలో పలు సూచనలు చేశారు ఎమ్మెల్సీ లు. వ్యవసాయ సీజన్ ఆరంభం అవుతున్న నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవాలని.. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా కౌలు రైతులు భూములు తీసుకునే పరిస్థితి లేదని సభ్యులు సభ ముందుకు తీసుకొచ్చారు.

కౌలు తీసుకున్న తర్వాత ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు జరిగితే ప్రభుత్వం గానీ ఇన్సూరెన్స్ కంపెనీలు గానీ ఇచ్చే నష్టపరిహారం కౌలు రైతులకు రావడంలేదని దీంతో కౌలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కౌలు రైతులకు భూ యజమాని సంతకంపెట్టాలన్న విధానాన్ని మినహాయించి గ్రామ సభలు, సచివాలయాలు ,రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులను గుర్తించాలని సూచించారు. అలాగే, స్కూల్స్ విలీనానికి సంబంధించి కూడా సభ్యుల నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. గ్రామస్థాయిలో కొన్ని సామాజిక వ్యవహారాలు ఉంటాయని, మూడు నాలుగు కిలోమీటర్ల దూరం చిన్న పిల్లలు వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయన్నారు సభ్యులు. పూర్వంలాగా స్వేచ్ఛగా రోడ్లపై నడిచే పరిస్థితి ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ పరిస్థితిలో లేవని సభ్యులు చెప్పారు .

దీంతో రెండు మూడు తరగతుల పిల్లలను దూరప్రాంతాలు పంపించే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రు లేరని, ప్రమాదాలు జరుగుతాయని భయపడుతున్నారని దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో పునరా ఆలోచన చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కోరారు. గత సీజన్లో వైరస్‌ల దెబ్బకు పూర్తిస్థాయిలో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల పేరుతో ఇన్సూరెన్స్ కంపెనీలు మిర్చి రైతులకు నష్టపరిహారం ఇవ్వడం లేదని, దీనిపై అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు సమావేశ దృష్టికి తీసుకువచ్చారు. కృష్ణా జిల్లాలో ఇదే తరహా లో నష్టపోయిన మిర్చి రైతాంగానికి కొంతమేర పరిహారం అందిందని, గుంటూరు జిల్లాలో పూర్తిస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు నష్టపోతున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీటిపై పూర్తిస్థాయిలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అంబటి రాంబాబు హామీ ఇవ్వడంతో జిల్లా పరిషత్ సమావేశం ముగిసింది.

Auto Driver Selfie Video: సెల్ఫీ వీడియో తీసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య