కర్నూలు జిల్లా ఆత్మకూరులో వర్ధన్ సొసైటీ మోసాలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. వర్ధన్ సొసైటీ మన బ్యాంకే అని చెప్పాను. కానీ డిపాజిట్లు చేయండని చెప్పలేదని ఆయన చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నోరు మూసుకుంటే మంచిదని లేకపోతే ఆయన చిట్టా అంతా విప్పుతానని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రభుత్వానికి విరాళాలు ఇస్తే తీసుకుంటామని, అందులో తప్పేముందని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు.
వర్ధన్ సొసైటీ నిర్వహకుడు బలన్నను పార్టీ నుంచి సప్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. పేదల నుంచి వసూళ్లు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని, వర్ధన్ సొసైటీలో తన ప్రమేయం ఉందని అంటున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి చర్చకు వస్తారా అని శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు.
ఆత్మకూరులో వర్ధన్ బహుళ రాష్ట్ర సహకార సంస్థ లిమిటెడ్ పేరుతో భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. వర్ధన్ మల్టీ కోపరేటివ్ సొసైటీ భారీ మోసాలపై కస్టమర్లు లబోదిబోమంటున్నారు. జిల్లా ఎస్పీకి కస్టమర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మహేష్ అలియాస్ జోసఫ్ కోట్లాది రూపాయలు మోసం చేసినట్టు తెలుస్తోంది.