Site icon NTV Telugu

మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్‌బ్రాండ్‌కు పూలు.. ముళ్లు తప్పవా?

Rojaa Minister

Rojaa Minister

ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పదోన్నతి పొందిన ఫైర్‌బ్రాండ్‌కు పూలు.. ముళ్లు తప్పవా? ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్కగా రాజకీయం ఉంటుందా? ఇన్నాళ్లూ ఆమెను ఫ్లవర్‌గానే చూసిన పార్టీలోని ప్రత్యర్థులకు ఇకపై ఫైర్‌ చూపిస్తారా?

నగరి వైసీపీలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారా?
చిత్తూరు జిల్లాలోని వైసీపీ రాజకీయాలు ఒక తీరున ఉంటే.. నగరిలో మరోలా ఉంటాయి. అక్కడ నుంచి వరసగా రెండోసారి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ప్రస్తుతం మంత్రి అయ్యారు. అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా.. సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ ఎలా ఉంటుందో రోజా స్వయంగా చూశారు. అసమ్మతులకు చెక్‌ పెట్టేందుకు ఎమ్మెల్యేగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించేవి కాదు. పైగా వాళ్లకు పదవులు వచ్చిపడటం రోజా శిబిరానికి అస్సలు మింగుడు పడేది కాదు. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడిస్తామని శపథాలు చేసిన వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి సమయంలో కేబినెట్‌లో చోటు సంపాదించిన రోజా.. సొంతపార్టీలోని ప్రత్యర్థులపై ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తారన్నది ప్రస్తుతం ప్రశ్న.

రోజాపై ఓపెన్‌గానే అసమ్మతి నేతల విమర్శలు
టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన రోజా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. 2014లో పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో తొలి కేబినెట్‌లోనే చోటు ఆశించారు. సామాజిక సమీకరణాలు.. రాజకీయ అవసరాల కారణంగా రోజాకు ఛాన్స్‌ దక్కలేదు. మూడేళ్లు వెయిట్‌ చేసిన తర్వాత ఇప్పుడు మంత్రి అయ్యారు రోజా. ఈ మూడేళ్ల కాలంలో నగరిలో తీవ్రస్థాయిలో అసమ్మతిని ఎదుర్కొన్నారు. రోజా వ్యతిరేక వర్గానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిల ఆశీసులు ఉండటంతో ఏం చేయలేకపోయేవారు. ఇదే సమయంలో రోజా సొంతపార్టీ ఎమ్మెల్యే అయినా అసమ్మతి నేతలు ఓపెన్‌గానే విమర్శలు.. ఆరోపణలు చేసేవాళ్లు.

వచ్చే ఎన్నికల్లో రోజా ఎలా గెలుస్తారో చూస్తామని పార్టీలోని ప్రత్యర్థుల సవాళ్లు
పంచాయతీ, మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నగరి వైసీపీలో విభేదాలు ఓ రేంజ్‌లో సాగాయి. ఒకానొక సమయంలో రోజాపై ఆమె వ్యతిరేక వర్గంగా భావించే అమ్ములు బ్యాచ్‌ దాడిచేసిన ఘటనలూ ఉన్నాయి. కేజే కుమార్‌, శ్రీశైలం ఆలయ ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా చేశారు. సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల సమయంలో రెండు వర్గాలు సై అంటే సై అనుకున్నాయి. సమస్య సర్దుబాటు కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేశారు రోజా. తాడేపల్లి వెళ్లి ప్రత్యర్థి వర్గంపై చర్యలు తీసుకోవాలని కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో కొన్నాళ్లుగా సైలెంట్‌ అయ్యారు రోజా.

మంత్రిగా నగరి వైసీపీలో పట్టు బిగిస్తారా?
కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపై చర్చ మొదలైన సమయంలో.. రోజా అనుకూల వర్గం ఒక్కసారిగా దూకుడు పెంచింది. రోజా మంత్రి అయితే నగరిలో లెక్కలు మారతాయని పార్టీ వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌లు హోరెత్తించారు. అయితే రోజాకు కేబినెట్‌లో చోటు దక్కదని ఆమె వ్యతిరేక వర్గం లెక్కలేసుకుందట. కానీ.. చూస్తుండగానే రోజా మినిస్టర్‌ అయ్యారు. నగరిలో ఆమె వ్యతిరేకవర్గం డీలా పడిందట. మారిన పరిస్థితులతో రోజాతో సై అనాలా.. లేక సంధికి వెళ్లాలా అనే చర్చ జరిగిందట. పైగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పార్టీలోని ప్రత్యర్థులపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన రోజా.. ఇప్పుడు మంత్రిగా ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్న. అలాగే మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నగరిలో రోజా పట్టు పెంచుకోవచ్చని అనుకుంటున్నారట. అందుకే నగరి వైసీపీ రాజకీయాలు.. మంత్రిగా రోజా వేసే ఎత్తుగడలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version