Site icon NTV Telugu

Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి రోజా, ఎమ్మెల్యే బాలకృష్ణ

Minister Roja

Minister Roja

Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. విజయదశమి కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే భవానీలు ఇరుముడి సమర్పించేదుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు కావటంతో రూ.300, రూ.100 టికెట్ దర్శనాలను అధికారులు నిలిపివేశారు.

Read Also: Rohit Sharma: అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

అటు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్యకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు బాలయ్యకు వేద ఆశీర్వచనం చేశారు. ఆయనకు ఆలయ అధికారులు అమ్మ వారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు. అమ్మవారి కరుణకటాక్షాలు భక్తులపై ఉండాలని, రాష్ట్రాభివృద్ది జరిగి ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని బాలయ్య మీడియాకు తెలిపారు. కాగా ఏపీ ప్రజలకు బాలకృష్ణ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరోవైపు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను మంత్రి రోజా కూడా దర్శించుకున్నారు. రాజధాని వికేంద్రీకరణకు అనుకూలంగా అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజరాజేశ్వరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ దీవెనలతో ప్రజలందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. వికేంద్రీకరణ జరగాలని అమ్మను వేడుకున్నానని.. వికేంద్రీకరణకు న్యాయపరమైన చిక్కులు వీడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. వికేంద్రీకరణ జరిగిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మ మొక్కు తీర్చుకుంటానని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Exit mobile version