Kottu Satyanarayana: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో క్షురకులుగా పనిచేసే వారికి ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షురకులకు నెలకు కనీసం రూ.20వేల ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రూ.20వేల కంటే తక్కువ వచ్చే ఆలయాల్లో ఆలయ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగతా మొత్తాన్ని ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన ఆలయాల్లో టిక్కెట్ల ద్వారా క్షురకులు ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని.. ఒకవేళ వాళ్లకు రూ.20వేల ఎక్కువ ఆదాయం వస్తే వారికి ఆలయ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా ఆ మొత్తం ఇప్పించాలని సీఎం జగన్ తమకు సూచించారని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
Read Also: MS Dhoni: నేను టెన్త్ పాసవుతానని మా నాన్నకే నమ్మకం ఉండేది కాదు..!!
అటు రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ టిక్కెట్ ధరలు పెంచలేదని, పెంచే ఆలోచన కూడా తమకు లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. కాణిపాకం ఆలయానికి సంబంధించి ఇన్‌ఛార్జి ఈవో అధికారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అందుకు ఆయన్ను బదిలీ చేశామని మంత్రి చెప్పారు. ఆలయాల్లో టికెట్ల ధరల పెంపుపై ఎలాంటి ప్రజాభిప్రాయసేకరణ చేయడం లేదన్నారు. రూ.కోటి ఆదాయం ఉన్న ఆలయాల పాలక మండలి నియామకాలు ధార్మిక పరిషత్ ద్వారా మాత్రమే చేపట్టాలని నిర్ణయించామన్నారు. దుర్గగుడిలో అంతరాలయం దర్శనం కోసమే టిక్కెట్ ధరను రూ.500గా చేసినట్లు వివరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అంతరాలయం, ప్రొటోకాల్ దర్శనాలను నియంత్రించడం కోసమే ఈ విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.