NTV Telugu Site icon

Minister Buggana: యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారు

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy

టీడీపీపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ధికపరమైన అంశాల్లో మాజీ మంత్రి యనమల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్ధిక నిర్వహణ చక్కగా చేశారంటూ ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ ప్రశంసించిందని బుగ్గన గుర్తుచేశారు. బడ్జెట్ అంచనాలకంటే తక్కువగానే అప్పులు చేశారని ఏపీని ఉద్దేశించి కాగ్ ప్రస్తావించిందన్నారు. దేశంలోనే ఆర్ధిక నిర్వహణ చక్కగా చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగంలో ఉందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే యనమల రాంగ్ ఫిగర్సుతో ప్రచారం చేస్తున్నారు. 2.10 శాతం మేర మాత్రమే ఫిస్కల్ డెఫిసిట్ ఉందని బుగ్గన తెలిపారు. కానీ ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా ఆర్థికపరమైన అంశాల్లో కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీకి బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదనే ఉద్దేశమే ప్రతిపక్ష టీడీపీలో కన్పిస్తోందని మంత్రి బుగ్గన చురకలు అంటించారు. గత ప్రభుత్వంలో యావరేజీగా 19.50 శాతం మేర అప్పులు పెరిగితే.. జగన్ ప్రభుత్వంలో కేవలం 15.50 శాతం మేర మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. ప్రతి దానికీ ఏపీని శ్రీలంకతో పోలుస్తున్నారని.. డీబీటీల ద్వారా రూ. 1.40 లక్షల కోట్లు పేదలకు చేర్చామని బుగ్గన తెలిపారు. నాన్ డీబీటీల ద్వారా రూ. 44 వేల కోట్లు లబ్దిదారులకు చేర్చామన్నారు. కేవలం బురద జల్లడమే టీడీపీ పనిగా పెట్టుకుందని బుగ్గన ఎద్దేవా చేశారు. టీడీపీ ఐదేళ్ల హయాంలో చేసిన నరేగా పనులను తాము మూడేళ్లల్లో చేశామని.. వాళ్ల హయాంలో 8.50 శాతం వడ్డీతో అప్పులు చేస్తే.. తమ హయాంలో 7.50 శాతంతో వడ్డీలు తెస్తున్నామని పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలు.. పెట్టిన ఖర్చుల లెక్కల విషయంలో టీడీపీ 86 శాతం మేర ఖర్చు పెడితే.. తమ ప్రభుత్వం 96 శాతం మేర ఖర్చుపెట్టిందని బుగ్గన వివరించారు.