AP Cabinet Expansion: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణపై ప్రచారం సాగుతోంది.. ఇప్పటికే కొందరు మంత్రులను పిలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు.. కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి నిర్ణయం, విచక్షణాధికారమన్న ఆయన.. దాని మీద మంత్రులం మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు మంత్రి వర్గ మార్పుకు సంబంధం ఏముంటుంది? అని ఎదురుప్రశ్నించారు.. ఇక, విశాఖపట్నం నుంచి రేపటి నుంచే పాలనా ప్రారంభం కావాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలిపిన బొత్స.. వికేంద్రీకరణ అనేదే మా పార్టీ, ప్రభుత్వ విధానంగా పేర్కొన్నారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మరోవైపు, ప్రతిపక్షాలపై మండిపడ్డారు బొత్స.. టీడీపీ వంటి కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆయన.. కోర్టుల్లో సాంకేతిక కారణాలతో కొన్ని ఆలస్యం అవుతున్నాయన్నారు.. ఇక, ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి నా వైఫల్యం అని ఒప్పుకున్నారు బొత్స.. లోపం ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటున్నాను.. వేరేవారి పై బాధ్యత వేయటం నా రాజకీయ జీవితంలో అలవాటు లేదని.. ఎన్నికల్లో నా పాత్ర కూడా ఉందని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, కేబినెట్ విస్తరణ, ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, నిన్న అమరావతిలో బీజేపీ నేతలపై జరిగిన దాడి వంటి అంశాలపై బొత్స తనదైన శైలిలో హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్లినా పరిస్థితులు బట్టి మాట్లాడాలన్నారు. తమపై బురద చల్లేందుకు రాజకీయ ప్రయోజనాలకోసం ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి బొత్స కామెంట్ చేశారు..
ఇక, ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అసలు ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం మాకేంటని ఫైర్ అయ్యారు. మంత్రివర్గంలో మార్పులు సీఎం ఇష్టమని, కేబినెట్ ప్రక్షాళనపై వస్తున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించారు. అలాగే ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతపైనా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి తన ఫెయిల్యూర్ గా భావిస్తున్నానంటూ బొత్స తెలిపారు. మంత్రిగా ఉండి నేనే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నానన్నారు. ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నామన్నారు. ఓటమికి తప్పు నాది కాదని పారిపోయే వాడిని కాదని బొత్స పేర్కొన్నారు. కాగా, ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పట్టభద్రుల స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.. దీంతో, అధికార వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని.. అందుకే కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం సాగుతోన్న విషయం విదితమే.