NTV Telugu Site icon

New Political Party For Uttarandhra: ఉత్తరాంధ్ర కోసం కొత్త పార్టీ..!

Metta Rama Rao

Metta Rama Rao

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారం హాట్‌ టాపిక్‌గా కొనసాగుతూనే ఉంది.. మా విధానం మూడు రాజధానులు. మా నిధానం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి… ఇదే మా లక్ష్యం అంటున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మూడు రాజధానుల వ్యవహారం కోర్టులో ఉంది. అమరావతి సంగతి తేలితే కానీ మూడు రాజధానుల కాన్సెస్ట్ ఫైనల్ కాదు. అయితే ఈ లోగా కొత్త కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. అమరావతే రాజధాని అంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అమరావతిలో భూములన్నీ కొనేసిన చంద్రబాబు… అక్కడే రాజధాని పెట్టి దాన్ని మరో హైదరాబాద్ చేయాలని చూస్తున్నారని… దానికి తాము అంగీకరించబోమని అన్నారు మంత్రి. ఒకవేళ అమరావతే రాజధాని గా ఉంటుంది అంటే విశాఖ రాజధానిగా ఉత్తరాంధ్రను రాష్ట్రం చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్ర భుత్వంలో మంత్రిగా ఉన్న ధర్మాన ఇలా మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ధర్మాన ఎందుకు ఇలా మాట్లాడారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే…. మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పడమే ధర్మాన ఉద్దేశం అంటున్నారు. ఒకవేళ అలా కాకుంటే అమరావతితో ఉత్తరాంధ్రకు వచ్చే నష్టాన్ని జనానికి వివరించి చెప్పడానికే ధర్మాన అలా అని ఉంటారని అంటున్నారు. విడిపోయి ఇప్పటికే నానాఇబ్బందిపడుతున్న రాష్ట్రాన్ని మళ్లీ ముక్కలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మరోవైపు ఉత్తరాంధ్ర రాష్ర్టం ఎజెండాగా జై ఉత్తరాంధ్ర పేరుతో పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దమౌతుంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ర్టం సాధించడం ద్వారానే అభివృధ్ది సాధ్యం అంటూ వక్తలు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ నినాదం ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆసక్తి నెలకొంది.

Show comments