NTV Telugu Site icon

ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే అంశంపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ

ఏపీలో పీఆర్సీపై స్పష్టత రావడం లేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు అన్ని ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. అయితే ఉద్యోగసంఘాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే పలుమార్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను పీఆర్సీపై చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే ఇప్పటివరకు పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్ళలేదు. అయితే తాజాగా ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే అంశంపై చర్చించేందుకు నేడు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది.

ఈ సమావేశంలో మంత్రుల కమిటీ ముందు మరోసారి తమ ప్రతిపాదనలు ఉంచే ఆలోచన చేయనున్నారు. రేపు మంత్రుల కమిటీ ముందు భేటీకి వెళ్లే అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జన అవుతున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ జీవోల రద్దు,అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్,పాత జీతాల పై మంత్రుల కమిటీకి ప్రతిపాదనలు ఇచ్చే ఆలోచనలో ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. సెక్రటేరియట్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. సచివాలయంలోని మూడు బ్లాక్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు సచివాలయ ఉద్యోగులు నిరాహార దీక్షకు దిగుతున్నారు.