NTV Telugu Site icon

Medicine Prices Hike: సామాన్యులపై మరో పిడుగు .. కొనేదెలా?

మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. ధరల మాట వింటే సామాన్యుడు షాక్ అవుతున్నాడు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ , వంట నూనెల పెరుగుదలలో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు మెడిసిన్స్ ధరలు పెరుగుతుండడంతో కొనేదెలా అని కలవరపడుతున్నాడు.

ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది చివరికి సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. ఎక్కడో రష్యా-ఉక్రెయిన్ యుద్దం వల్ల ఇండియాలో వంట నూనెలు, ఇంధన ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు కూడా పెరుగుతాయి అన్న వార్త వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా కాలంలో మెడిసిన్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఒక్క డోలో -650 టాబ్లెట్స్ మాత్రమే కరోనా కాలంలో 350 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు ఈ డోలో, పారాసెటమాల్ తో సహా దాదాపు 809 రకాలకు పైగా మందుల ధరలు పెరగనున్నాయి.

కరోనా కాలంలో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రజలు వెంటనే మెడికల్ దుకాణాల వైపు పరుగెడుతున్నారు. జ్వరం, జలుబు, తలనొప్పి ఇలా ఏ చిన్న సమస్య ఉన్నా అది కరోనా అని భయపడి మందులు స్టాక్ పెట్టుకుంటున్నారు. సెకండ్, థర్డ్ వేవ్ సమయంలో ఇది మరింత అధికమయ్యింది. బీపీ తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు 850 షెడ్యూల్‌ చేసిన మందుల ధరలు ఏప్రిల్‌ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే , ఈ సంవత్సరం మందుల ధరలు పోలిస్తే 10 శాతం పెరిగినట్లు నేషనల్‌ ఫార్మా స్యూటికల్‌ అథారిటీ తాజాగా ప్రకటించింది. దీంతో పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌ తో సహా పలు అత్యవసర మందుల రేట్లు పెరిగిపోనున్నాయి.

ఇక రోజూ వారి మందులు వాడే వారికి మెడిసిన్స్ ధరల పెరుగుదల పెద్ద ఇబ్బందిగా మారనుంది. జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండెజబ్బులు, బీపీ, రక్తహీనత తదితరాల చికిత్సలో వినియోగించే పారాసిటమాల్‌, అజిత్రోమైసిన్‌, , మెట్రోనిడాజోల్‌ వంటి మందుల తో పాటు ఈ జాబితాలో ఉన్నాయి. నాన్‌-షెడ్యూల్‌ డ్రగ్స్‌ ధరల వార్షిక పెరుగుదల పోలిస్తే తొలిసారిగా షెడ్యూల్‌ డ్రగ్స్‌ ధరల పెంపు ఎక్కువగా ఉండనుంది. ధరల సూచీలో మార్పుల కారణంగా కొన్నేళ్లుగా ఈ పెరుగుదల 1-2శాతానికే పరిమితమైంది. 2019లో ఔషధ కంపెనీలకు 2శాతం పెంపును అనుమతించగా, 2020లో కేవలం 0.5 శాతం పెంచారు….గత నెలలోనే రష్యా- ఉక్రెయిన్ యుద్ద ప్రభావం వల్ల మందుల ధరలు పెరగగా ఇప్పుడు చమురు ధరల ప్రభావం తో మరో సారి పెరగనున్నాయి కొవిడ్‌ అనంతరం ముడిపదార్థాలు, ప్యాకింగ్‌, రవాణా తదితర ఖర్చులు పెరిగిపోవడంతో మందుల ధరలు పెంచాలని కంపెనీలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయంతో కంపెనీలకు ఊరట కలగనుంది.

మరోవైపు ఈ ధరల పెరుగులపై సామాన్య జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు ఇంధన ధరలు, గ్యాస్ ధరలు , వంట నూనెలు ధరలు.. మరోవైపు ఈ మందుల ధరలు పెరుతుండడంతో జనరిక్ మందుల దుకాణాల సంఖ్య పెంచాలని సాధారణ మందులపై ధరలు పెంచవద్దంటున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గించాలని కోరుతున్నారు.