Man Killed His Brother In Law For Land In Anantapur: ఇంట్లో అల్లరి చేస్తూ, సరదాగా గడిపే 15 ఏళ్ల అబ్బాయి ఓరోజు ఉన్నట్టుండి మాయమయ్యాడు. ఎక్కడ వెతికినా జాడ కనిపించలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చూస్తుండగానే రెండున్నర నెలలు గడిచిపోయాయి. అప్పుడు వెలుగులోకి వచ్చింది అసలు.. ఇంట్లో ఉన్నవాడే ఆ అబ్బాయిని కడతేర్చాడని! ఆస్తి కోసం బావమరిదిని సొంత బావే హత్య చేశాడు. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన దండా శారదమ్మకు అఖిల్(15) అనే కుమారుడితో పాటు వర్షిత, త్రిష అనే ఇద్దరు కుమారైలున్నారు. ఎనిమిది నెలల క్రితం పెద్ద కుమార్తె వర్షితకు గుద్దెళ్ల గ్రామానికి చెందిన అనిల్‌తో వివాహమైంది. ఇతను భార్యతో కలసి అత్తారింట్లోనే ఉంటున్నాడు.
కట్ చేస్తే.. గ్రామంలో శారదమ్మకు 13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానిపై అనిల్ కన్ను పడింది. అయితే.. ఆ భూమి మొత్తం శారదమ్మ తన కుమారుడు అఖిల్‌కే ఇచ్చేస్తుందని, అలా కాకుండా ఆ భూమి తన సొంతం చేసుకోవాలంటే అఖిల్ అడ్డు తొలగించాల్సిందేనని అనిల్ భావించాడు. అందుకు అతడు పక్కా ప్లాన్ వేసుకున్నాడు. ఈ ఏడాది మే 21న అఖిల్‌కు సెల్‌ఫోన్ బహుమానంగా ఇస్తానని నమ్మించి, బైక్‌లో ఎక్కించుకుని వెళ్లాడు. తన వ్యవసాయ తోటలోకి తీసుకెళ్లి, అఖిల్‌ని హతమార్చి, సమీపంలోని వంకలో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి తిరిగొచ్చేశాడు. అయితే.. కుమారుడు కనిపించడం లేదని శారదమ్మ చుట్టూ గాలించింది. తెలిసివారిని సంప్రదించింది. ఎక్కడా లేడని తెలియడంతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినా, వాళ్లకీ అతని జాడ కనిపించలేదు. ఇలా నెలరోజులు గడిచిపోయాయి.
తన కొడుకు ఎక్కడికి వెళ్లిపోయాడా? అని బాధ పడుతున్న శారదమ్మకు.. ఓరోజు తన అల్లుడు అనిల్‌పై అనుమానం వచ్చింది. అఖిల్‌ను చివరిసారిగా బైక్‌పై తీసుకెళ్లింది అతడే కావడంతో, ఆ విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత అనిల్‌ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అతడు అసలు నిజం కక్కేశాడు. అత్త భూమి కోసం తానే బావమరిదిని చంపి, పూడ్చివేశానని అంగీకరించాడు. నిందితుడ్ని అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు.
