Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: మంత్రి కాకాణినీ వదలని లోన్ యాప్ సిబ్బంది.. 79 సార్లు కాల్స్

Minister Kakani Loan App Ag

Minister Kakani Loan App Ag

Loan App Agents Harassed Minister Kakani With 79 Phone Calls: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇప్పటివరకూ ఎందరో సామాన్య ప్రజలు బలయ్యారు. చివరికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా వీరి వేధింపుల బారిన పడ్డారు. ఇప్పుడు ఈ జాబితాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా చేరిపోయారు. ఈయన్ను కూడా లోన్ యాప్ సిబ్బంది వదల్లేదు. తనకు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోకుండా.. ఏకంగా 79 సార్లు ఫోన్ చేసి విసిగించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి, పోలీసుల్ని ఆశ్రయించి, వారి ఆట కట్టించారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. కాకాణి విషయంలో ‘అశోక్ కుమార్’ పేరుని వినియోగించారు.

‘‘అశోక్ కుమార్ లోన్ తీసుకొని కట్టట్లేదు. ప్రత్యామ్నాయంగా మీ నంబర్ ఇచ్చారు. ఆయన్ను అడిగితే, మీరు కడతారని చెప్తున్నారు. కాబట్టి.. తక్షణమే లోన్ డబ్బులు తిరిగి ఇచ్చేయండి’’.. ఇవి అనిల్ కుమార్ యాదవ్‌తో లోన్ రికవరీ ఏజెంట్లు మాట్లాడిన మాటలు. ‘నాకు అతనెవరో తెలియదు మొర్రో’ అని మంత్రి మొత్తుకుంటున్నా.. ‘డబ్బులు తినేసి కట్టకపోతే ఎలా’ అంటూ రివర్స్‌లో వాదించారు. ఇంకేముంది, ఆయనకు కోపమొచ్చి పోలీసుల్ని రంగంలోకి దింపారు. సరిగ్గా ఇదే సీన్ మంత్రి కాకాణి విషయంలోనూ రిపీట్ అయ్యింది. ఇక్కడ కూడా అశోక్ కుమార్ పేరు చెప్పి, ఆయన తీసుకున్న లోన్ కట్టమని పదేపదే ఫోన్ చేశారు. లోన్‌తో ఎలాంటి సంబంధం లేదని కాకాణి పీఏ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. లోన్ కట్టాల్సిందేనంటూ కొన్ని గంటల వ్యవధిలోనే 79 కాల్స్ చేశారు. ఆ సమయంలో మంత్రి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఉన్నారు.

దాంతో విసుగెత్తిపోయిన మంత్రి కాకాణి.. నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. చెన్నైలోని కోల్ మేన్స్ సర్వీసెస్ అనే రికవరీ ఏజెన్సీ నుంచి కాల్స్ వచ్చినట్టు తేలింది. చెన్నైకు వెళ్లి, వారిని అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారిని విడిపించేందుకు ఏకంగా పది మంది ప్రముఖ న్యాయవాదులు వచ్చారు. అది చూసి తాను షాక్‌కు గురయ్యానని మంత్రి కాకాణి అన్నారు. ఏపీలో లోన్ యాప్ బ్యాచ్‌ల ఆటలు సాగకపోవడంతో.. చెన్నై నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. మంత్రిగా ఉన్న తననే వేధించారంటే, సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థంచేసుకోవచ్చని అన్నారు. లోన్ యాప్ ముఠాను ఉచ్చులోకి లాగేందుకు, తన పీఏ ద్వారా రూ.25 వేలు చెల్లించినట్టు మంత్రి వెల్లడించారు.

Exit mobile version