ఏపీలో గతంలో పెండింగ్‌లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్‌ల గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్‌లు భారీగా దాఖలు కానున్నాయి. గురువారం అమావాస్య కావడంతో పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్షిస్తోంది. ప్రతి రెండుల గంటలకోసారి ఎస్ఈసీ అధికారులు నివేదిక తెప్పించుకుంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లోనే కాకుండా నామినేషన్‌ల పర్వంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రులను అనుకూలంగా ఉండేవారిని ఆర్వోలుగా పెట్టారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.
Read Also: కరోనా ఎఫెక్ట్.. కాంతుల్లేని దీపావళి
కాగా నవంబర్ 6న ఉదయం 11 గంటలకు నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను నవంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. నవంబర్ 14న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు. మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌లో నవంబర్ 15న పోలింగ్ నిర్వహించి 17న ఫలితాలు ప్రకటిస్తారు. గతంలో రద్దయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 16న పోలింగ్ నిర్వహించి 18న ఫలితాలు వెల్లడిస్తారు. కాగా ఈ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ, నెల్లూరు కార్పొరేషన్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్, కుప్పం మున్సిపాలిటీలోని అన్ని స్థానాలను దక్కించుకుంటామనే ధీమాలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.
