ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జానే. అనంతలో భూఆక్రమణదారుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములా.. అసైన్డ్ భూములా అన్న తేడాలు ఏమీ లేవు.. కనిపిస్తే కబ్జా చేసేస్తామన్న ధోరణిలో ముందుకెళుతున్నారు. అయితే వీరి దాహం మరింత వికృత రూపం దాల్చి ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ ఎన్ఓసీ తెచ్చుకున్నారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వెలుగులో చూసిన కలెక్టర్ సంతకం ఫోర్జరీ సంతకం వ్యవహారం కలకలం రేపుతోంది.
అనంతపురం జిల్లాలో భూ మాయగాళ్లు రోజు రోజుకీ పేట్రేగిపోతున్నారు. ఇటీవల ఎక్కడ చూసినా భూముల ధరలకు రెక్కలు రావడంతో వారు అడ్డూ అదుపు లేకుండా భూముల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. పాత కాలంలో అయితే దౌర్జన్యం చేసి భూములు కబ్జా చేసే వారు. ఇప్పుడు ట్రెండ్ మార్చి.. అక్రమ కొనుగోళ్లను సక్రమం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కడ జెండా పాతేస్తున్నారు. దానికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి.. లీగల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారం జిల్లాలో కలకలం రేపుతోంది. ఏకంగా భూ మాయగాళ్లు బరి తెగించి.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సంతకాలనే ఫోర్జరీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇంతకీ ఎక్కడుంది.. ఆ భూమి.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలను ఎందుకు ఫోర్జరీ చేశారు?
కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్ 525, 526లో బోయ నారాయణప్ప పేరిట 34.86 ఎకరాల పొలముంది. దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. చెరువుకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో నిత్యం ఊటనీరు ఊరుతోంది. ఈ మొత్తం గతంలో కొందరు పేదలకు అసైన్డ్ చేసి ఇచ్చారు. అనంతపురం నగరానికి సమీపంలో ఉండటం.. దీనికి తోడు.. రహదారికి ఆనుకుని ఉండటంతో రియల్ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది.అందుకే సదరు రైతు నుంచి తక్కువ ధరకు ఈ భూమిని కొనుగోలు చేశారు. ఇక ఎన్ఓసీ కోసం తమ వేట సాగించారు. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్న తక్కువ టైంలోనే తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ కలెక్టర్, జేసీ సంతకాలతో ఎన్‌ఓసీని అందజేశాడు.
అయితే ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో కానీ.. అంత తక్కువ టైంలో అందునా జేసీ, కలెక్టర్ సంతకాలు పూర్తి చేసుకుని రావడంపై అనుమానాలు వచ్చాయి. లోతుగా ఆరా తీయడంతో ఫోర్జరీ సంతకాలుగా తేలింది. దీంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ ఆదేశాలిచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో కూడేరు నుంచి కలెక్టరేట్ వరకు అంతా రెవెన్యూ సిబ్బందే ఉన్నట్టు తెలుస్తోంది. కూడేరు మండలం రెవెన్యూ ఉద్యోగులు, ఆర్డీవో కార్యాలయంలోని ఓ అధికారి సహకరించినట్లు తెలుస్తోంది.
మరో వైపు పుట్లూరు మండలంలో కూడా 216 ఎకరాలకు భూమి లేకుండా పాసుపుస్తకాలు సృష్టించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు 175 ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లను ఆన్లైన్ లో తొలగించేందుకు రంగం సిద్ధం చేశారుమరో 41 ఎకరాల పై విచారణ చేయాల్సి ఉందని ఆర్డీవో తెలిపారు.మండల పరిధిలోని అరకటవేములలో 15 ఎకరాలు, కుమ్మనమలలో 50 ఎకరాలు, చింతకుంట లో 22 ఎకరాలు, చింతలపల్లి లో 20 ఎకరాలు, పుట్లూరు మండల కేంద్రం పరిధిలో 67 ఎకరాల సంబంధించిన సర్వే నెంబర్లను తొలగించారు. ఈ భూ కుంభ కోణానికి పాల్పడిన అధికారుల పై నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.
ఇప్పటికే పుట్లూరు మండలంలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ జరిపిన ఆర్డీవో కూడేరులో జరిగిన నకిలీ ఎన్వోసీ ల భాగోతం ప్తె కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మండలంలో నాయకుల ప్రమేయం లేకుండా ఇది జరగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలను కూడా ఫోర్జరీ చేయడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
Akasa Air: వచ్చే నెలలో ‘ఆకాశ’ విమానం టేకాఫ్.. ఫస్ట్ లుక్ విడుదల