Minister TG Bharath: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెడుతుంది.. ఇక, కర్నూలులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించిన జాబ్ మేళాను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతకు ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, కర్నూలు జిల్లాకు రానున్న పెట్టుబడులు, పరిశ్రమలు, పైలట్ శిక్షణ కేంద్రం తదితర అంశాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో నిర్వహించిన జాబ్ మేళాలో 1,053 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
కర్నూలుకు పైలట్ ట్రైనింగ్ సెంటర్
కర్నూలు జిల్లాకు పైలట్ ట్రైనింగ్ సెంటర్ రావడం యువతకు మంచి అవకాశమని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ నెల 26న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారని తెలిపారు. ఇక, కర్నూలు విమానాశ్రయంలో Orient Flights Aviation Academy ఆధ్వర్యంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 26న శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పైలట్లుగా ఎదగాలని టీజీ భరత్ సూచించారు. రాష్ట్రంలో విమానయాన రంగానికి సంబంధించిన శిక్షణ మౌలిక సదుపాయాలు పెరగడం ద్వారా ఈ రంగంలో కెరీర్ అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటంతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు.
రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం
రాష్ట్రంలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని టీజీ భరత్ పేర్కొన్నారు. అలాగే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయని తెలిపారు. ఈ పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చి పరిశ్రమలు ఏర్పాటైతే భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. పెట్టుబడులను గ్రౌండింగ్ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు.
ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
కర్నూలు జిల్లా వనరులను వినియోగించుకుని ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని టీజీ భరత్ తెలిపారు. ఓర్వకల్లులో ఇప్పటికే పారిశ్రామిక, విమానయాన రంగాల అభివృద్ధిపై దృష్టి కొనసాగుతోంది. డ్రోన్ సిటీని తయారీ, పరిశోధన, పరీక్షలు, సర్టిఫికేషన్, శిక్షణకు సంబంధించిన సమగ్ర హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గతంలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది.
సెమీకండక్టర్ పరిశ్రమకు అవకాశం
ISM పాలసీ కింద అవసరమైన క్లియరెన్స్ వస్తే ఓర్వకల్లులో సుమారు రూ.23 వేల కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో భారీ పెట్టుబడులు వస్తే కర్నూలు ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. ఓర్వకల్లులో రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని టీజీ భరత్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్‌ను ఉపయోగించుకుని రిలయన్స్ ప్రతినిధులతో చర్చలు జరిపి కర్నూలులో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. అలాగే రిలయన్స్ ఆధ్వర్యంలో ఓర్వకల్లులో మరో ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుందని మంత్రి చెప్పారు. ఈ పరిశ్రమలు, పెట్టుబడులు కార్యరూపం దాల్చితే స్థానికంగా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఉద్యోగాలతో పాటు స్కిల్స్‌పై దృష్టి
యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడటం మాత్రమే కాకుండా తమ నైపుణ్యాలను పెంచుకోవాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. పరిశ్రమలు, టెక్నాలజీ, విమానయాన రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు యువతను పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇక, కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని టీజీ భరత్ అన్నారు. నగరంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కర్నూలు జిల్లాకు పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి అంశాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్..

