ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లిన ఏపీ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. చాలామంది యువతీయువకులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఈ జాబితాలో కర్నూలుకు చెందిన దిలీప్ అనే యువకుడు కూడా ఉన్నాడు. కర్నూలు జిల్లా బాలాజీనగర్‌కు చెందిన చిలుమూరు శ్రీనివాసరావు, శారదాదేవి దంపతుల కుమారుడు దిలీప్ అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేశాడు. అగ్రికల్చర్‌లోనే ఎమ్మెస్సీ చేయాలని నిర్ణయించుకుని ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. 2019 సెప్టెంబర్‌లో ఇటలీకి వెళ్లి అనుకున్నట్లుగానే అక్కడ ఎమ్మెస్సీ పూర్తి చేశాడు.
ఉద్యోగం రాగానే ఓసారి ఇంటికి వస్తానని ఇటీవల తన తల్లిదండ్రులకు దిలీప్ సమాచారం అందించాడు. అనంతరం శుక్రవారం ఇటలీలోని మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు దిలీప్. అక్కడ సముద్రం ఒడ్డున నిలబడి ఉండగా రాకాసి అలలు వచ్చి దిలీప్‌ను తీసుకెళ్లిపోయాయి. దిలీప్‌ను కాపాడాలని కోస్ట్ గార్డులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి దిలీప్ మృతదేహం కోస్ట్ గార్డులకు దొరికింది. విదేశాల్లో ఉన్నత చదువు పూర్తి చేసుకుని కొన్ని రోజుల్లో ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు కొడుకు మరణ వార్త తెలియడంతో వాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు.
