NTV Telugu Site icon

ఇవాళ, రేపు కేఆర్ఎంబీ బృందం కర్నూలు పర్యటన

ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించనుంది 10 మంది కేఆర్ఎంబీ బృందం. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో పర్యటిస్తోంది కేఆర్ఎంబీ టీమ్. నేడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను సందర్శించనుంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనుంది కేఆర్ఎంబీ టీమ్. అనంతరం శ్రీశైలంలో కేఆర్ఎంబీ టీం సమీక్ష సమావేశం నిర్వహించనుంది.

ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు యత్నిస్తోంది కేఆర్‌ఎంబీ బోర్డు. తెలంగాణ తీరుపై ఏపీ అసంతృప్తిగా వుంది. శ్రీశైలంలో నీటిని వాడుకునే విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ ఆగ్రహంగా వుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల నేపధ్యంలో కేఆర్ ఎంబీ సభ్యుల పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

ఇటు శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుతోంది. ఇన్ ఫ్లో 8,214 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 73,541 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 879.20 అడుగుల నీటిమట్టం వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 183.8486 టీఎంసీలుగా వుంది. జలాశయంలో కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.