Site icon NTV Telugu

Konaseema: రేపు మరో నిరసనకు ఆందోళనకారుల పిలుపు

Amalapuram 2

Amalapuram 2

కోనసీమ జిల్లా మార్పుపై అమలాపురంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోనసీమ సాధన సమితి మరో నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకోవాలని, నిరసన చేపట్టాలని తెలిపింది. దీంతో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమలాపురంలో నిరసనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌బాబు ఇళ్లకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అటు నిరసన కారుల దాడుల్లో పోలీసులు కూడా గాయపడ్డారు.

LIVE: గాల్లో కాల్పులు. చేయిదాటిన పరిస్థితి

అటు కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో హోంశాఖ అప్రమత్తమైంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జిల్లాకు అదనపు బలగాలను పంపింది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలయ్యేలా చర్యలు చేపట్టారు.

అటు అమలాపురంలో ఇప్పటికీ వేలాది మంది నిరసనకారులు రోడ్లపైనే ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు. కనబడిన వాహనాలపై రాళ్లురువ్వుతున్నారు. నిరసనకారులను ఇంటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అమలాపురంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమలాపురం పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Exit mobile version