Deputy CM Pawan Kalyan: ప్రతి ప్రభుత్వ కాలేజీకి పూర్వ విద్యార్థుల నుంచి సహకారం అందితే ఆ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉండది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రంగరాయ మెడికల్ కాలేజ్ దేశానికి అనేక మంది ఉత్తమ వైద్యులను అందించిందని, ఈ కాలేజ్ అందరికీ ఇన్స్పిరేషన్‌గా నిలవాలని పవన్ తెలిపారు. మూలాలు ఎంత బలంగా ఉంటే అదే స్థాయిలో భవిష్యత్తు కొనసాగుతుంది. ఈ కాలేజ్ నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు తమ వంతు బాధ్యతగా సహాయం చేస్తే ప్రభుత్వ కాలేజీలు మరింత బలోపేతం అవుతాయి అని ఆయన చెప్పారు.
Read Also: Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఇక, అరకులో మహిళలు సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్నారని, గిరిజన ప్రాంతాల్లో తీవ్రమైన వైద్యుల కొరత ఉందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నెలలో కనీసం ఒకరోజైనా వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఇంకా కొందరు చదువుకున్నప్పటికీ కులాల గురించి మాట్లాడటం బాధాకరమని అన్నారు. కులానికి రంగు ఉండదు. ధైర్యం లేకపోతే ముందుకు వెళ్లలేం. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన ఆలోచనలు మారాలి అని పవన్ స్పష్టం చేశారు. కష్టం వచ్చినప్పుడు ముందుగా గుర్తొచ్చేది డాక్టర్లేనని, అందుకే వైద్య వృత్తికి సమాజంలో ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి సంస్థలు ప్రతి జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కాకినాడ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు బయల్దేరి వెళ్లిపోయారు..
